16 మంది మహిళలను చంపిన హంతకుడు: చిన్న చీటితో....

By telugu teamFirst Published Jan 26, 2021, 7:16 AM IST
Highlights

అతను చేసిన హత్యలు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఏకంగా 16 మంది మహిళలను మట్టుబెట్టిన సైకోను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు.

హైదరాబాద్: ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 16 మంది మహిళలను పొట్టన పెట్టుకున్న నరహంతకుడు పోలీసుల చేతికి చిక్కినట్లు వార్తలు వచ్చాయి. చిన్న చీటీతో అతను పోలీసుల చేతికి చిక్కాడు. ఒంటరిగా ఉన్న మహిళలను తన మాయమాటలతో నమ్మించి శివారులోకి తీసుకుని వెళ్లి అత్యంత కిరాతకంగా చంపుతూ వచ్చాడు. 

ఈ నెల మొదటివారంలో హైదరాబాదు శివారులోని అంకుషాపూర్ సమీపంలో సగం కాలిన మహిళ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయితే, మృతురాలికి సంబంధించిన ఏ విధమైన సమాచారం కూడా లభించలేదు. 

మహిళను చంపేసి గుర్తు పట్టకుండా ఉండడానికి ముఖం మీద పెట్రోలు పోసి తగులబెట్టడంతో కేసును ఛేదించడం కష్టంగా మారింది. అయితే, ఆమె చీర కొంగుకు ముడి కనిపించింది. ముడి విప్పి చూస్తే అందులో ఓ చిన్న చీటీ కనిపించింది. అందులో ఓ ఫోన్ నెంబర్ రాసి ఉంది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

అది నేరేడ్ మెట్టుకు చెందిన వ్యక్తి ఫోన్ నెంబర్ అని తెలిసింది. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. ఆమె పేరు వెంకటమ్మ అని, జూబ్లీహిల్స్ లోని వెంకటగిరిలో నివాసం ఉంటుందని చెప్పాడు.

రాచకొండ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించారు. జనవరి 1వ తేదీ నుంచి వెంకటమ్మ కనిపించడం లేదని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ రోజు ఆమె ఫోన్ బేగంపేటలో స్విచాఫ్ అయినట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. 

ఓ చోట ఆమె మరో వ్యక్తితో కలిసి ఆటో ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి ఫొటోను మృతురాలి కుటుంబ సభ్యులకు చూపించారు. అతన్ని తాము చూడలేదని వారు చెప్పారు. మల్కాజిగిరికి చెందిన వ్యక్తి కూడా అతనెవరో తనకు తెలియదని చెప్పాడు. 

చివరకు ఓ చేపల వ్యాపారి గుర్తు పట్టాడు ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులే ఆశ్చర్యపోయారు. వెంకటమ్మను మాత్రమే కాకుండా చాలా మంది మహిళలను చంపినట్లు అంగికారించాడు. చివరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి 16 మందిని ఆ సైకో హతమార్చినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. ఆ సైకో ఎందుకు ఇలా మహిళలను చంపాడనే విషయాన్ని కూడా పోలీసులు రాబట్టనున్నారు.

click me!