
ACB summons BRS leader KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కు బిగ్ షాక్ తగిలింది. మరోసారి ఆయనకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు పంపింది. హైదరాబాద్‌లో 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు ఈవెంట్ లో అవకతవకల కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్ కు సోమవారం (మే 26న) ఏసీబీ తాజా నోటీసులు జారీ చేసింది. మే 28న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
కేటీఆర్ స్వయంగా ఈ నోటీసు స్వీకరించిన విషయాన్ని ధృవీకరించడంతో పాటు.. “న్యాయాన్ని గౌరవించే పౌరుడిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తాను. ఇది ఖచ్చితంగా రాజకీయ వేధింపుల కేసు” అని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ప్రస్తుతం యూకే, అమెరికాలోని పలు ఈవెంట్‌లలో పాల్గొనడానికి షెడ్యూల్‌లో ఉన్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసినట్టు చెప్పారు. “తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ ఎదుట హాజరవుతాను” అని తెలిపారు.
రాజకీయ కక్షతోనే ఈ నోటీసులు వచ్చాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ విచారణ వెనుక రాజకీయ కక్ష ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు గుప్పించారు. అలాగే ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీటులో రేవంత్ రెడ్డి పేరు ఉన్నదని గుర్తు చేశారు. “48 గంటల క్రితమే ఆయన పేరు ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఉంది. 24 గంటలకే ఆయన ప్రధాని మోడీతో కలిసి బీజేపీ నేతలతో విందులో కనిపించారు” అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసు సీజన్ 10 కోసం క్యాబినెట్ ఆమోదం లేకుండా రూ. 54 కోట్లు (రూ. 8 కోట్లు పన్నులతో సహా) ఖర్చు చేసిందని పేర్కొంది. ఈ వ్యవహారంపై ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌కు మెమో జారీచేసినట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ, ఈ ఈవెంట్ కోసం మొత్తం రూ. 55 కోట్లు ఖర్చు చేశారనీ, అయితే “Ace Nxt Gen” అనే సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుని ఒప్పందాన్ని ఉల్లంఘించినా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు లేవనెత్తింది. దీని కారణంగా 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ రేసు రద్దయ్యింది. కాగా, ఏసీబీ తాజా నోటీసులతో మే 28న జరిగే విచారణకు కేటీఆర్ వ్యక్తిగతంగా హాజరవుతారా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది.