టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. ఈ కేసులో అడ్వకేట్ శ్రీనివాస్, బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిల ను నిందితులుగా చేరుస్తూ మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు ఇవాళ కొట్టివేసింది..ఈ ఏడాది అక్టోబర్ 26న మొయినాబాద్ ఫాంహౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామచంద్రభారతి, సింహాయాజీ, నందకుమార్ లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని నమోదైన కేసులో ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులతో సంబంధం ఉందనే విషయమై పలువురిని సిట్ విచారించింది.ఈ క్రమంలోనే అడ్వకేట్ శ్రీనివాస్ ను గత నెల 21న సిట్ బృందం విచారించింది. నవంబర్ 21, 22 తేదీల్లో కూడా శ్రీనివాస్ ను సిట్ బృందం విచారించింది. ఆ తర్వాత ఈ కేసులో ఏ 7 నిందితుడిగా అడ్వకేట్ శ్రీనివాస్ ను చేరుస్తూ మొయినాబాద్ పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ మెమోను ఏసీబీ కోర్టు ఇవాళ కొట్టివేసింది.
ఈ ఏడాది నవంబర్ 21న విచారణకు రావాలని తుషార్, జగ్గుస్వామి, బీఎల్ సంతోష్ లకు సిట్ నోటీసులు జారీ చేసింది. హైకోర్టు సూచనతో నవంబర్ 23న మరోసారి బీఎల్ సంతోష్ కి సిట్ నోటీసులిచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గత నెల 25న బీఎల్ సంతోష్ హైకోర్టులో సిట్ నోటీసులను సవాల్ చేశారు. దీంతో ఈ నెల ఐదో తేదీ వరకు సిట్ నోటీసులపై స్టే విధించింది హైకోర్టు. మరో వైపు ఈ నెల 3వ తేదీన జగ్గుస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై నిన్న హైకోర్టు విచారణ నిర్వహించింది. సిట్ నోటీసులపై స్టే ఇచ్చింది. బీఎల్ సంతోష్ కి ఇచ్చిన స్టే ను కూడా ఈ నెల 13వ తేదీకి పొడిగించింది. జగ్గుస్వామికి కూడా సిట్ ఇచ్చిన నోటీసులపై ఈ నెల 13 వ తేదీ వరకు స్టేను ఇచ్చింది.
ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతుంది. గత మాసంలో ఈ విషయమై వాదనలు జరిగాయి.గత వారంలో జరిగిన వాదనలకు కొనసాగింపుగానే ఇవాళ కూడా వాదనలు సాగుతాయి. తమ ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతుంది. తమ పార్టీలో ఎవరినైనా చేర్చుకొంటే నేరుగా చేర్చుకొంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మధ్యవర్తుల ద్వారా చర్చలు జరిపి పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఈ విషయమై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే.