
హైదరాబాద్ శివార్లలోని అబ్ధుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధి ఆంజనేయులు ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే శనివారం విద్యార్ధి సంఘాల నేతలు కాలేజ్ వద్ద ఆందోళన నిర్వహించడంతో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధి ఆంజనేయులు తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇంత పెద్ద కాలేజీలో సీసీ కెమెరాలు లేవని.. కాలేజ్ సిబ్బందిని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆమె ఆరోపించారు. కాలేజ్ లోనే ఏదో జరిగిందని.. మెయిన్ గేట్ వద్ద సీసీ ఫుటేజ్ పది నిమిషాలు లేదని విద్యార్ధి తల్లి చెప్పారు. తమ కొడుకు కనిపించడం లేదని మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ ఫోన్ చేస్తేనే కానీ వార్డెన్ రాలేదని.. మూడ్రోజుల నుంచి ఫోన్ చేయడం లేదని ఆంజనేయులు తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహితులకు ఫోన్ చేస్తే తమకు కనిపించలేదని చెప్పారని, మా కొడుకుకి ఏం జరిగినా యాజమాన్యానిదే బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.