టిఎస్ పి ఎస్ సి కి ఒక తెలంగాణా నిరుద్యోగి బహిరంగ లేఖ

Published : Jun 06, 2017, 11:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
టిఎస్ పి ఎస్ సి కి ఒక తెలంగాణా నిరుద్యోగి బహిరంగ లేఖ

సారాంశం

...చివరగా ఒక్కటి అడుగుతున్నాను చక్రపాణి సర్ మిమ్మల్ని... దమ్ముంటే పరీక్షను రద్దు చేసి ఇంకో మూడు నాలుగు నెలలు గడువిచ్చి మీరు చేసిన తప్పును సరిద్దుకోండి. లేదంటే తెలంగాణలో నియామకాల కోసం మరో ఉద్యమం తప్పదు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ధేశించండి అంతే కానీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకండి..వారి జీవితాలను అంధకారం చేయకండి..అది మీ హక్కు కాదని తెలుసుకోండి.

 

గౌరవనీయులైన టీఎస్ పీఎస్సీకి,

 

తెలంగాణ ప్రభుత్వానికి మర్యాదపూర్వకంగా ఈ లెటర్ రాస్తున్నాను. వీలైతే మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. లేదు.. మేం చెప్పం అని మీరంటే 2019 ఎన్నికలే ఆ సమాధానం చెప్తాయి..ఇది నా ఒక్కడి మాట కాదు. యావత్తు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి, మీ ప్రభుత్వం ఏర్పడటానికి కారకులైన నిరుద్యోగ యువకులందరిది.
          నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పీఠమెక్కారు..బాగనే ఉంది..అడగని వాళ్లకు, అడిగిన వాళ్లందరికీ జీతాలు పెంచుతున్నారు..ఇది మరీ బాగుంది... మరి నిరుద్యోగులేం పాపం చేశారని వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు? ఇంకా మీరు నిరుద్యోగులను ఓటర్లుగానే చూస్తున్నారా చెప్పండి..ఓటుతోనే సమాధానం చెప్తాం! . సరే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది  మీ తెలంగాణ సర్కారు గురించి... 

 

( ఈ ఉత్తరాన్ని గ్రూప్ 2 అభ్యర్థులు వాట్సాప్, మెయిల్ ద్వారా టిఎస్ పి ఎస్ సి  ఛెయిర్మన్కు,సభ్యులకు , కార్యదర్శికి పంపాలనుకుంటున్నారు)

 

ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నాను ఘంటా చక్రపాణి సర్.  విద్యార్థుల భవిష్యత్తులతో ఇక మీరు ఆడుకున్నది చాలు. ఇంకొద్దు.. మేం కోల్పోయింది చాలు మీవల్ల. టీఎస్ పీఎస్సీ ఏర్పడగానే నిరుద్యోగుల జీవితాల్లో సంతోషమేర్పడింది..ఆ సీట్లో మీరు కూర్చోగానే దానికి మరింత వన్నె వచ్చిందని తెగ సంబరపడి పోయాం. ఇది మూణ్నాళ్ల ముచ్చటనేనని మూడేళ్ల పాలన గడవక ముందే ముద్దుగా తేల్చేశారు. 


   ఇంట్లో కూడు లేక, కట్టుకోవడానికి సరైన గుడ్డ లేక, చదువుకున్న చదువుకు విలువలేక, ఊర్లో కలిసిన ప్రతిసారి తెలిసిన వాళ్లు ఏం చేస్తున్నావు రా అడిగితే ఏం చెప్పాలో తెలియక అయోమయపడుతూ,  అవమానపడుతూ, ఇంకెతకాలం చదువుతవురా అని పదే పదే తల్లిదండ్రులు తిడుతుంటే....అవన్నీ దిగమింగుకొని ఏదైనా  ఒక పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే నెల ముందు నుండే తెలిసి, తెలియని, మన, నా అనుకున్న వాళ్లందరినీ అడుక్కొని వెయ్యి రూపాయలు అప్పుగా తెచ్చుకొని ఊరి నుంచి 20 కి.మీలు ఛార్జీలు పెట్టుకొని ప్రయాణం చేసి తీరా అక్కడి కెళ్లాక ఆన్ లైన్ సెంటర్లో 40 కట్టి, అప్లై చేసినందుకు మీరు ఫిక్స్ చేసిన 250, 300, etc…. ఇలా ఎంతైతే అంత కట్టి బయట హోటల్ లో తిని అక్కడ ఇంకో 70 కట్టి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుంటే విజేత కాంపిటీషన్, ఉద్యోగ సోపానం, కరెంట్ అఫైర్స్ బుక్స్ కనిపిస్తే వాటిని కొని..కనిపించి, కనిపించని బుక్స్ ఇలా అన్ని కొనుక్కొని అప్పు తెచ్చుకున్న వెయ్యి ఒక్కరోజే ఖర్చు పెట్టి మళ్లీ ఇంటికొచ్చి బుక్స్ ముందరేసుకొని పొద్దస్తమానం చదివి పరీక్షలు రాస్తే మీరు చేస్తున్నదేమిటి?...ఇది ఒక వైపే....ఇంకో వైపు పుట్టిన ఊరును, కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యా పిల్లలను అందరినీ వదిలేసి జాబు వస్తుందన్న నమ్మకంతో కోచింగ్ సెంటర్లలో వేలు ధారబోసి, అక్కడ ఉండడానికి ఓ రూమ్ వెతుక్కొని దానికి రెంట్ కడుతూ, బయట మెస్ లలో తింటూ రాత్రనక, పగలనక రూమ్ లల్లో, లైబ్రరీల్లో చదువుకొంటూ పరీక్షలు రాస్తే మీరు చేస్తున్నదేమిటి?  పెళ్లిళ్లు మానుకొని, వచ్చిన సంబంధాలు చెడగొట్టుకొని ఇంట్లో వాళ్లకు సమాధానం చెప్పలేక, జీవితంలో స్థిరపడతామన్న భరోసా లేక మీరు రిలీజ్ చేసే నోటిఫికేషన్లనే నమ్ముకొని అప్పో సొప్పో చేసి చదువుకుంటూ కాలం వెళ్లదీస్తుంటే మీరు మాకిచ్చే బహుమతి ఇదా?


          సరే ఇదంతా ఉండని గానీ....ఓ  నిరుద్యోగ అభ్యర్థిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను... సమాధానం చెప్పండి.... 


• టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో అవకతవకలు జరిగితే పట్టించుకోరా? అది మీ బాధ్యత కాదా?
•  ఓఎమ్ఆర్  షీట్లో వైట్ నర్ దిద్దిన వారిని సెలెక్ట్ చేయడం మీకు ఎంత వరకు సబబుగా ఉంది?
• మీరు(టీఎస్ పీఎస్సీ) ముందుగా ఇన్ స్ట్రక్షన్స్ లో పేర్కొన్నట్లు ఓఎమ్ ఆర్ షీట్ పై దిద్దు బాట్లు చర్యలను అంగీకరించబోమని చెప్పారు..మళ్లీ మీ నిబంధనలను మీరే ఉల్లంఘించడం ఎంత వరకు కరెక్ట్ ?
• అసలు వైట్ నర్ ను సెంటర్ లోకి ఎందుకు అనుమతించారు ? అన్నీ చెక్ చేసే మీకు వైట్ నర్లు కనిపించలేదా? వందల సంఖ్యలో వైట్ నర్లున్న ఓఎంఆర్ షీట్లు ఎలా వస్తాయి? దాని వెనక మీ హస్తం ఉందా? 
• కట్ ఆఫ్ లిస్ట్ పెట్టకుండా డైరెక్ట్ ఫలితాలు రిలీజ్ చేయడం వెనుక ఏమైనా ఉద్ధేశం ఉందా?
• ఒకే సెంటర్ నుంచి వందల సంఖ్యలో అభ్యర్థులు ఎలా సెలెక్ట్ అయ్యారు ? దీని వెనక ఏదైనా మతలబు ఉందా? లేదా ఆయా సెంటర్లలో మాస్ కాఫీయింగ్ జరిగిందా?
•  అర్హులకు అవకాశం దక్కలేదని రోడ్లపైకి వచ్చి వేలాది మంది అభ్యర్థులు వాపోతుంటే వారి గోడు మీకు వినిపించడం లేదా?
• వైట్ నర్ దిద్దే వారి విషయంలో సుప్రీంకోర్టు తీర్పును మీరు లెక్కచేయరా? అయినా మీరు లెక్కచేసి ఉంటే వైట్ నర్ పెట్టిన వాళ్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎందుకు పిలుస్తారు ?
• ఎప్పుడో నవంబర్ లో పరీక్ష అయిపోతే కొంతమంది అభ్యర్థులు వైట్ నర్ విషయంలో కోర్టుకు వెళ్లారు..మరి ఆ 3 నెలల గ్యాప్ లో మీరేం చేశారు ?వాళ్లు కోర్టు మెట్లు ఎక్కేదాకా వేచిచూశారా?
• 17 ప్రశ్నలను అర్ధాంతరంగా తొలగించారు.. దానికి సంబంధించి మీరు టీఎస్ పీఎస్సీ ఎలాంటి మార్గదర్శకాలు లేవు. టీఎస్ పీఎస్సీ అంటే రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ సంస్థ కాబట్టి అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంది?
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నియామకాల్లో అన్యాయం జరిగిందనే తెలంగాణను కొట్లాడి తెచ్చుకుంటిమి..ఇప్పుడు అందులో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.దీనికి మీ సమాధానం ఏమిటి?

• మీరు ప్రైమరీ, ఫైనల్ కీ లు ఇవ్వడానికి ఎందుకంత సమయం తీసుకున్నారు? అభ్యర్థుల ఎదురుచూపులతో ఆటలాడాలనుకున్నారా? ఆ జాప్యానికి కారణాలేంటి? 
• మీరిచ్చిన ప్రతి ‘కీ’ లో సవాలక్ష తప్పులున్నాయి..అంత నిర్లక్ష్యం ఎందుకు చేసినట్లు? పోనీ మీరు కొలువు దీరిన సర్కారులో కీ తయారు చేసే నిష్ణాతులు కరువయ్యారా? గ్రూప్ 2  అంటే మీ దృష్టిలో చిన్నపిల్లలు ఆడుకునే ఆటనా?
•  గ్రూప్ 2 పరీక్షకు ముందు 350 మార్కులు తెచ్చుకొని చూపించండని సవాల్ చేసిన మీకు ఈరోజు 420,430,440, 450 మార్కులు తెచ్చుకున్న వాళ్లు కనిపించడం లేదా? వాళ్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎందుకు అనుమతించడం లేదు? అవి మార్కులు కావా? ఇప్పటికీ చాలా మంది అన్నేసి మార్కులు తెచ్చుకున్నా జాబ్ వస్తుందన్న నమ్మకం లేకుండా చేశారు.
• మీది నిజంగా మాటల ప్రభుత్వమే అని నిరూపించారు..చేతల ప్రభుత్వం కాదని ఇప్పుడు తేలిపోయింది..ప్రకటనల్లో కాదు సర్ దమ్ము చూపించాల్సింది... చెప్పిన పని చెప్పినట్లు చేయడంలో చూపించండి..
• నోటిఫికేషన్ లో 1:2 ప్రకారం ఇంటర్వ్యూకు పిలుస్తామన్నారు..మళ్లీ కొత్తగా 1: 3 ఏంటీ సర్ ?ముందుగానే ఇలాంటి విషయాలు మీడియాకు చెప్పాల్సిన బాధ్యత, ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలన్న కనీస జ్ఞానం లేదా? డైరెక్ట్ గా మీరెవరు సర్ నిర్ణయాలు తీసుకోవడానికి? 

                      చివరగా ఒక్కటి అడుగుతున్నాను సర్ మిమ్మల్ని... దమ్ముంటే పరీక్షను రద్దు చేసి ఇంకో మూడు నాలుగు నెలలు గడువిచ్చి మీరు చేసిన తప్పును సరిద్దుకోండి. లేదంటే తెలంగాణలో నియామకాల కోసం మరో ఉద్యమం తప్పదు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ధేశించండి అంతే కానీ విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకోకండి..వారి జీవితాలను అంధకారం చేయకండి..అది మీ హక్కు కాదని తెలసుకోండి.

 

ఇట్లు

ఒక తెలంగాణ నిరుద్యోగి

హైదరాబాద్.

 

 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?