
హాస్టల్ లో ఉండడం ఇష్టం లేని ఆ బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. హాస్టల్ లో ఉండడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించలేక తనకు హాస్టల్ ఉండడం ఇష్టం లేక సతమతమై తుదకు ఆత్మహత్యవైపు అడుగులేశాడు. పురుగుల మందు తాగి ఆ పసిబాలుడు ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో 7వ తరగతి చదివే విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
తుంగతూర్తిలోని మైనార్టీ బాలుర రెసిడెన్సియల్ పాఠశాలలో వేణు అనే విద్యార్థి 7వ తరగతి చదువుతున్నాడు. వేణు స్వగ్రామం మేళ్లచెరువు మండలంలోని వేపుల సింగారం అనే ఊరు. అయితే వేణుకు హాస్టల్ లో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని హాస్టల్ లో చేరిన నాటినుంచి సహచర విద్యార్థులకు చెబుతూ ఉండేవాడు.
ఈ నేపథ్యంలో దసరా సెలవులు ముగించుకుని వేణు బుధవారమే హాస్టల్ కు వచ్చాడు. అయితే హాస్టల్ లో ఉండడం ఇష్టం లేని వేణు ఆ బాధ భరించలేక ఇంటినుంచి వచ్చేటప్పుడే పురుగుల మందు కూడా వెంట తెచ్చుకున్నాడు. దీంతో గురువారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.
సహచర విద్యార్థులు గుర్తించి వెంటనే సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వేణు ఆసుపత్రిలోనే మరణించాడు.
7వ తరగతి బాలుడు చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తోటి విద్యార్థులు కూడా ఏడుస్తున్నారు.
ఈ సంగటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.