Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
Telangana: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి..విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో నగదు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి పట్టుబడుతున్నాయి. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా తరలిస్తున్న డబ్బు, బంగారం మొదలైన వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుండి శనివారం వరకు రికార్డ్ స్తాయిలో నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి పట్టుబడ్డాయి. ఆయా జిల్లాల సరిహద్దుల్లో నిర్వహిస్తున్న తనిఖీల ద్వారా శనివారం రాత్రి వరకు రూ.74,95,31,197 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి పట్టుబడినట్టు సమాచారం. తనిఖీలు ప్రారంభమైన నాటి నుంచి శనివారం వరకు సుమారు రూ.48,32,99,968 నగదు పట్టుబడినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తనిఖీ బృందాలు చాలా యాక్టివ్ గా విధులు నిర్వర్తిస్తున్నాయి.