65వేల సీడ్ బాల్స్ తయారీ... సిరిసిల్ల చిన్నారి అరుదైన ఘనత... బ్లెస్సీకి కేటీఆర్ బ్లెస్సింగ్స్

Arun Kumar P   | Asianet News
Published : Jan 31, 2022, 02:20 PM ISTUpdated : Jan 31, 2022, 02:27 PM IST
65వేల సీడ్ బాల్స్ తయారీ... సిరిసిల్ల చిన్నారి అరుదైన ఘనత... బ్లెస్సీకి కేటీఆర్ బ్లెస్సింగ్స్

సారాంశం

తెలంగాణ ప్రభుత్వ పర్యావరణ రక్షణ, ప్రకృతిహిత కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతూ ఏకంగా 65వేల సీడ్ బాల్స్ తయారుచేసిన సిరిసిల్ల చిన్నారి బ్లెస్సీని మంత్రి కేటీఆర్ అభినందించారు. 

హైదరాబాద్: పర్యావరణ హితం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హరితహారం (harithaharam) పేరిట భారీగా చెట్ల పెంపకాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ మంచిపనిలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ (joginipally santosh) 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' (green india challange) ప్రారంభించారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు మొక్కలు నాటుతూ మరికొందరికి మొక్కటు నాటాలంటూ ఛాలెంజ్ విసురుతూ  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకువెళుతున్నారు. తాజాగా సామాన్యులు కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేస్తూ సంతోష్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.

మొక్కలు నాటడమే కాదు సీడ్ బాల్స్ (seed balls) తయారుచేసి వాటిని అడవుల్లో, రోడ్ల పక్కన వెదజల్లడం ద్వారా మొక్కల పెంపకాన్ని చేపట్టే కార్యక్రమానికి ఎంపీ శ్రీకారం చుట్టారు. అయితే ఈ సీడ్ బాల్స్ కాన్సెప్ట్ సిరిసిల్ల జిల్లా సుద్దాలకు చెందిన ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీ (blessy)కి బాగా నచ్చినట్లుంది. దీంతో తండ్రి పోత్సాహంతో వెంటనే సీడ్ బాల్స్ తయారీని ప్రారంభించింది. ఇలా ఇప్పటివరకు ఈ  బాలిక 65వేల సీడ్ బాల్స్ తయారు చేసి అరుదైన రికార్డ్ సాధించింది. 

ఇలా తయారుచేసిన సీడ్ బాల్స్ ను సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది బ్లెస్సీ. ఇలా పర్యవరణహిత కార్యక్రమం చేస్తూ ఆదర్శంగా నిలిచిన బ్లెస్సీ గురించి మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కు తెలిసింది. ఇవాళ(సోమవారం) ఆమె పుట్టినరోజని తెలిసి తనవద్దకు పిలిపించుకున్న మంత్రి కేటీఆర్ బాలికను ప్రత్యేకంగా అభినందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి బాలికను మరోసారి అభినందించారు.

అంతకుముందు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన బ్లెస్సీ ఎంపీ సంతోష్ కుమార్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని జిహెచ్ఎంసీ పార్కులో బాలికతో ప్రత్యేకంగా ఓ మొక్కను నాటించారు ఎంపీ. అనంతరం తాను తయారుచేసిన సీడ్ బాల్స్ ను బాలిక ఎంపీకి బహూకరించింది. 

ఇక్కడినుండి బ్లెస్సీతో పాటు తల్లిదండ్రులు, సోదరున్ని ఎంపీ సంతోష్ తనవెంట తీసుకుని కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. చిన్నతనంలోనే బ్లెస్సి ప్రకృతిపై ఇంత ప్రేమ పెంచుకోవడానికి కారణం తల్లిదండ్రులేనని తెలుసుకున్న కేటీఆర్ దంపతులు ప్రకాష్,మమతను అభినందించారు. ఇలాగే ప్రకృతిహిత కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని... ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని బ్లెస్సీతో పాటు ఆమె కుటుంబానికి కేటీఆర్ భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకృతి, పచ్చదనాన్ని కాపాడేందుకు హరితహారం... దీని స్పూర్తితో గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం మొదలయ్యిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలే ఇప్పుడు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రాబోయే తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని... ఇందుకోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. 

ఇక ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం పిల్లల్లో కూడా చైతన్యం నింపడం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ ఆనందం వ్యక్తం చేసారు. పిల్లల్లో ప్రకృతి పట్ల అవగాహన మరింత పెరగాలంటే... ప్రకృతి పట్ల ప్రేమను కనబరిచే చిన్నారులను ప్రోత్సహించాలి అని ఎంపీ సంతోష్ కుమార్ ఆకాంక్షించారు. 

 

PREV
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu