తెలంగాణలో కొత్తగా 41 కేసులు, ఇద్దరి మృతి: 1,367కి చేరిన బాధితుల సంఖ్య

By Siva KodatiFirst Published May 13, 2020, 10:04 PM IST
Highlights

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా బుధవారం కొత్తగా 41 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,367కి చేరుకుంది

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా బుధవారం కొత్తగా 41 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,367కి చేరుకుంది. ఇవాళ వైరస్ బారినపడి ఇద్దరు మరణించడంతో, మొత్తం మృతుల సంఖ్య 34కి చేరింది.

బుధవారం నమోదైన కేసుల్లో 31 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదవ్వగా, పది మంది వలస కూలీలకు కరోనా సోకింది. ఇవాళ ఒక్కరోజే 117 మంది డిశ్చార్జ్ అవ్వడంతో.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 939కి చేరింది. 394 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల గురించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఒకరి నుంచి మరోకరికి దాదాపు 90 కుటుంబాలకు కరోనా సోకినట్లు గుర్తించారు.కరోనా పరీక్షలు ఆలస్యం కావడం వల్లే నగరంలో కరోనా కేసులు పెరిగిపోయినట్లు తెలుస్తోంది.

Also Read:కేసీఆర్ గారు... హైదరాబాద్‌లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి: రాములమ్మ ఫైర్

కరోనా అనుమానితులకు వెంటనే పరీక్షలు చేయడం లేదనే వాదనలు కూడా వినపడుతున్నాయి. కొందరు కరోనా లక్షణాలు కనపడంతో ఆస్పత్రిలో చేరుతుండగా... వారికి పరీక్షలు చేసి రిజల్ట్ రాకముందే ఇంటికి పంపుతారు. రిపోర్టు వచ్చేలోపు సదరు వ్యక్తి కారణంగా అతని కుటుంబసభ్యులు వైరస్ దాటికి బలౌతున్నారు.

దిల్‌సుఖ్‌నగర్‌లోని తిరుమలగిరికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి (75) వైరస్‌ బారిన పడ్డాడు. అతడి నుంచి కుటుంబంలోని తొమ్మిది మందికి వైరస్‌ సోకింది. అతడి భార్య వైర్‌సతో చనిపోయింది. 

తలాబ్‌కట్ట ప్రాంతంలో ఓ వృద్ధురాలికి వైరస్‌ సోకింది. ఆమె ద్వారా సుమారు 34 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో ఆమె కుటుంబ సభ్యులే 28 మంది ఉండ గా, ఇద్దరు డాక్టర్లు, మరో ఇద్దరు నర్సులు, ఇతర సిబ్బంది ఇద్దరు ఉన్నారు. 

వనస్థలిపురంలో ఓ వ్యాపారికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అతడి తొమ్మిదిమంది కుటుంబసభ్యులకూ వైరస్‌ సోకింది. హుడా సాయినగర్‌లో వృద్ధురాలికి వైరస్‌ సోకవడంతో ఆమె కూతురు, అల్లుడు, మనమడు, మనుమరాలు, కొడుకు, అతని భార్య, ఇద్దరు పిల్లలకు విస్తరించింది. 

జియాగూడ సబ్జిమండిలో కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్‌ తేలింది. కుటుంబసభ్యులు 12మంది వైరస్‌ బారినపడ్డారు. అతను వైర‌స్‌తో చనిపోయాడు. వెంకటేశ్వరనగర్‌ బస్తీకి చెందిన వృద్ధురాలికి(75) ద్వారా ఆమె కుటుంబంలో 11 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఆమె కోడలు ఆస్పత్రిలో చనిపోయింది. 

Also Read:ఒకరి నుంచి మరొకరికి... 90కుటుంబాలకు కరోనా

సాయిదుర్గానగర్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి (26)తోపాటు భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిపి మొత్తం ఏడుగురికి వైరస్‌ సోకింది. దుర్గానగర్‌కు చెందిన బియ్యపు వ్యాపారి (38) కుటుంబంలోని నలుగురు ఆస్పత్రి పాలయ్యారు. 

జియాగూడ బస్తీకి చెందిన ఎలక్ట్రీషిన్‌ (45) కుటుంబంలో ముగ్గురు వైరస్‌ బారిన పడ్డారు. ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన ఓ మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ కాగా, భర్త,  కుమార్తె, కోడలికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెకు జ్వరం వచ్చినప్పుడు వైద్యం చేసిన వైద్యుడికి, ఆమె కుమారుడు, ఇద్దరు మనవళ్లకు నెగటివ్‌ వచ్చింది. 

డబీర్‌పురలోని బీబీకా ఆలంకు చెందిన ఒకరి ద్వారా అతడి తల్లి, ముగ్గురు కుమార్తెలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భార్యకు  మాత్రం నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 

click me!