తెలంగాణలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావులు ముఖ్యమంత్రిని కలిసినవారిలో వున్నారు.
తెలంగాణలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావులు ముఖ్యమంత్రిని కలిసినవారిలో వున్నారు. దీంతో వీరు నలుగురు కారు దిగుతారనే ప్రచారం జరుగుతోంది.
దీనికి కొన్ని గంటల ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మిగలరని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలంతా జైళ్లకు వెళ్లడం ఖాయమని, కేసీఆర్ ఫ్యామిలీ తర్వాత జైలుకు పోయే మొట్టమొదటి వ్యక్తి జగదీష్ రెడ్డేనని వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బొటాబొటీ మెజార్టీతో గెలుపొందిన రేవంత్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చునని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పులి బయటకొస్తుందంటూ ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీనికి కాంగ్రెస్ వైపు నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. తాము తలచుకుంటే బీఆర్ఎస్ 39 ముక్కలవుతుందని , ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడంటూ అంటున్నారు. ఇలాంటి దశలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం దుమారం రేపుతోంది. వీరే రేపో మాపో పార్టీ మారడం ఖాయమని, త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వీరిని అనుసరిస్తారంటూ కథనాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికే తాము ఆయనను కలిశామని దీనిపై ఎవరికి వారు నచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాము పనిచేస్తామని, తాము ఎవరితోనూ చర్చలు జరపలేదని సునీత స్పష్టం చేశారు.
తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లాకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరామని సునీత తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ .. అంతకుముందు మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరామని వారు గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడినట్లయ్యింది.