
హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెడుతుండగా.. మరో రైలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. హైదరాబాద్- బెంగళూరుల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెలలో ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి రూట్లలోరెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. హైదరాబాద్- బెంగళూరుల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తే.. ఇది హైదరాబాద్ నుంచి నడిచే మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కానుంది.
నివేదిక ప్రకారం.. తాజా వందే భారత్ రైలు బెంగళూరులోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్, హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌ల మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు రెండు ప్రధాన ఐటీ నగరాలై హైదరాబాద్, బెంగళూరుల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి
ఇప్పటికే ట్రయల్ రన్ ప్రారంభమైనట్లు సమాచారం. ‘‘గత రెండు రోజుల నుంచి.. మేము కాచిగూడ, డోన్ (ఆంధ్రప్రదేశ్) మధ్య వందే భారత్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాము. అధికారిక ప్రక్రియ తర్వాత ఈ సేవ త్వరలో ప్రారంభమవుతుంది’’అని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు రైలులో ప్రయాణించేందుకు దాదాపు 11 గంటల సమయం పడుతోంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో ప్రయాణ సమయం ఎనిమిదిన్నర గంటలకు తగ్గుతుంది. అయితే ఈ రైలు లాంచ్ తేదీ, టిక్కెట్ ఛార్జీలు, స్టాప్‌ల గురించి అధికారిక సమాచారం లేదు. అయితే నివేదికల ప్రకారం.. ఈ నెలలోనే ఈ వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ వందే భారత్ రైలును ప్రధాని మోదీ ఈ నెల 6న లేదా 15న వర్చువల్ గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు చెబుతున్నారు.