BRS party working president KTR: ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రాజెక్టుల కారణంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భూముల విలువలు అనేక రెట్లు పెరిగాయని బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్) అన్నారు. భువనగిరి, చౌటుప్పల్, షాద్ నగర్, సంగారెడ్డి తదితర ప్రాంతాలను కవర్ చేసే 332 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు ఔటర్ రింగ్ రోడ్డు మధ్య కొత్త అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు.
Telangana Assembly Elections 2023: మఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సర్కారు తెలంగాణలో మెరుగైన పాలన అందిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారక రామారావు (కేటీఆర్) అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, భద్రత కోసం అనేక సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. అలాగే, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ విలువ, రియల్ ఎస్టేట్ విలువ వీరికి అర్థం కావడం లేదన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నారు.. కానీ తెలంగాణ గెలవాలని తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు.
బీజింగ్ తరహాలో హైదరాబాద్ ను అభివృద్ది చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఐదు కేంద్రీకృత రింగ్ రోడ్లు ఉన్న బీజింగ్ తరహాలో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్ ), ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్ )లను కలుపుతూ 332 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్ ) అభివృద్ధికి ప్రణాళికలను గురించి కూడా మంత్రి మాట్లాడారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 40 శాతం జనాభాకు రీజినల్ రింగ్ రోడ్డు వర్తిస్తుందనీ, 20 పట్టణాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామన్నారు.
2014 లో తెలంగాణ ఏర్పడినప్పటి నుండి "స్థిరమైన ప్రభుత్వం సమర్థవంతమైన నాయకత్వం" కింద బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాన్ని హైలైట్ చేసిన కేటీఆర్.. కోవిడ్ -19 మహమ్మారి విసురుతున్న సవాళ్లు ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో ఎంతో అభివృద్ది చేశామని తెలిపారు. అలాగే, కుల వ్యవస్థపై పోరాటానికి మూలధనాన్ని ఉపయోగించుకునే విధానంగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని రూపొందించిందని కేటీఆర్ అన్నారు. ''పెద్ద పెద్ద ఐడియాలు మాత్రమే క్లిక్ కావు. రోజువారీ సమస్యలను ఒక స్థాయిలో పరిష్కరించడం ద్వారా అనేక అవకాశాలు లభిస్తాయి. ఒక సంస్థను శక్తివంతం చేయడానికి రుణాలు తీసుకోవడం తప్పు కాదు. దళిత బంధును విజయవంతం చేయడం వల్ల ఇతరులకు పూచీకత్తు లేని రుణాలు లభిస్తాయి. ఈ గ్రాంటును పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించవచ్చు'' అని కేటీఆర్ తెలిపారు.