ఎక్కడో జరిగిన సంఘటన మరెక్కడో కరోనా కేసులు పెరగడానికి కారణమవుతోంది.ఇలా నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరగడానికి నాగార్జునసాగర్ ఉపఎన్నిక కారణమయ్యింది.
నిజామాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా తయారయ్యింది రాష్ట్రంలో కరోనా పరిస్థితి. ఎక్కడో జరిగిన సంఘటన మరెక్కడో కరోనా కేసులు పెరగడానికి కారణమవుతోంది. ఇలా నాగార్జునసాగర్ ఉపఎన్నిక నిజామాబాద్ జిల్లాలో భారీసంఖ్యలో పోలీసులు కరోనాబారిన పడటానికి కారణమయ్యింది.
వివరాల్లోకి వెళితే... టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాలమరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరిగాయి. సరిగ్గా ఎన్నికల ప్రక్రియ, పార్టీల ప్రచారం ఊపందుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యింది. దీంతో ప్రచారంలో పాల్గొన్న నాయకులే కాదు ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసులు కూడా కరోనా బారినపడ్డారు.
undefined
read more కేసీఆర్ కు కరోనా: కొంప ముంచిన నాగార్జునసాగర్ ప్రచార సభ?
ఇలా సాగర్ ఎన్నికల సందర్భంగా బందోబస్తు కోసం వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన పోలీసుల్లో చాలామంది ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల కోసం నిజామాబాద్ జిల్లా నుండి ఓ ఏసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు కలిపి 112 మంది సాగర్ విధుల్లో పాల్గొన్నారు. వీరిలో ఇప్పటివరకు 32మందికి పైగా పోలీసులకు కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో సాగర్ ఉపఎన్నిక విధులకు వెళ్లిన మిగతా పోలీసుల్లోనే కాదు జిల్లా పోలీసులందరిలో ఆందోళన నెలకొంది.
ఇక ఇదే నాగార్జునసాగర్ శాసనసభకు జరిగిన ఉప ఎన్నిక కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసఅర్ సైతం కరోనా వైరస్ సోకింది. కోరనా విస్తరణను బేఖాతరు చేస్తూ ఆయన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్నారు. అదే కేసీఆర్ కు కరోనా సోకడానికి కారణమైందనే ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు కరోనా పాజిటివ్ గా తేలడం ఈ విషయాన్ని బలపరుస్తోంది. సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న బిజెపి, కాంగ్రెసులకు చెందిన పలువురు నాయకులకు కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.