కుంటాల జలపాతం చూడడానికి వెళ్లి ముగ్గురు టిసిఎస్ ఉద్యోగుల మృతి

First Published Jul 2, 2018, 4:59 PM IST
Highlights

మరో ముగ్గురి పరిస్థితి విషమం...

వారంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లు. మంచి ఉద్యోగం, మంచి జీతం తో జీవితంలో స్థిరపడిపోయారు. ఇలా తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన వేళ రోడ్డు ప్రమాదానికి గురై దారుణంగా మృతిచెందారు. ఆదిలాబాద్ లోని కుంటాల జలపాతం వద్ద విహారానికి వెళ్లి తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  

ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని టిసిఎస్ కంపనీలో దినేష్‌ , కుసుమ, యుగేంధర్‌, శ్రీవిద్య, నవీన్‌, నిఖిత లు సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.  నిన్న ఆదివారం సెలవురోజు కావడంతో ఈ ఆరుగురు సరదాగా విహారయాత్రకు బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఓ స్కార్పియో వాహనంలో వీరంతా బయలుదేరారు.

అక్కడ రోజంతా సరదాగా గడిపి సాయంత్రం సమయంలో హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లి గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న దినేష్ తో పాటు ముందు సీట్లో కూర్చున్న కుసుమ అక్కడిక్కడే మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీవిద్య మృతిచెందింది. మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను కాపాడి వెంటనే నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

click me!