హైద్రాబాద్ , సికింద్రాబాద్ పరిధిలో వరుస అగ్ని ప్రమాదాలతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు హడావుడి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: గత ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు హైద్రాబాద్ లో జరిగిన నాలుగు అగ్ని ప్రమాదాల్లో 29 మంది మృతి చెందారు. హైద్రాబాద్, నగరంలో అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు హడావుడి చేస్తున్నారు. మిగిలిన సమయాల్లో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఎక్కువగా సికింద్రాబాద్ జోన్ లో ఎక్కువగా జరిగాయి. జనావాసాల మద్య వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం కూడా అగ్ని ప్రమాదాలకు కారణంగా స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
2022 మార్చి 23న సికింద్రాబాద్ బోయిగూడ లో గల తుక్కు గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్ పై అంతస్థులో నిద్రపోయిన కార్మికులు నిద్రలోనే మృత్యువాత పడ్డారు.
undefined
2022 సెప్టెంబర్ 12న సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఈ ఏడాది జనవరి 29వ తేదీన సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నిన్న సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగరు మృతి చెందారు.
హైద్రాబాద్ , సికింద్రాబాద్ లలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సమయాల్లో అధికారులు హడావుడి చేస్తున్నారు. వాణిజ్య భవనాల్లో ఫైర్ సేఫ్టీ కి సంబంధించి ఏర్పాట్లు చేశారా లేదా అనే విషయాలపై తనిఖీలు చేయాలి. కానీ భవనాల నిర్మాణల అనుమతుల మంజూరు విషయంలో కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు.
నగరంలో వరుస అగ్ని ప్రమాడాలు జరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు తప్పనిసరిగా పోలీస్ లైసెన్స్ తీసుకోవాలనే నిబంధనను ఈ ఏడాది ఏప్రిల్ నుండి అమలు చేయనున్నారు. గతంలో ఈ నిబంధన అమల్లో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ నిబంధనను అమలు చేయడం లేదు. అయితే వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో పోలీస్ లైసెన్స్ ను ఈ ఏడాది ఏప్రిల్ నుండి అమలు చేయనున్నారు.