విషాదం : 22 యేళ్లకే 50 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. అంతలోనే గుండెపోటుతో మృతి..

By SumaBala BukkaFirst Published Sep 27, 2022, 11:41 AM IST
Highlights

కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన హైదరాబాద్ కు చెందిన అభిజిత్ రెడ్డికి సౌదీలో రూ.50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అయితే జాబ్ లో చేరకముందే గుండెపోటుతో అతను మరణించడంతో విషాదం అలుముకుంది. 

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు అభిజిత్ రెడ్డి (22) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం రాత్రి నిద్రలోనే అభిజిత్ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

అయితే అభిజిత్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు. కాగా, కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభిజిత్ ఇటీవల సౌదీ అరేబియాకు చెందిన ఓ ఆయిల్ కంపెనీలో 50 లక్షలకు పైగా ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. వచ్చేనెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో అభిజిత్ మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

హైద్రాబాద్ లో సెటిల్ మెంట్లు: పోలీసుల అదుపులోకి నయీం ప్రధాన అనుచరుడు శేషన్న

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 30న ఓ వ్యక్తి ఇలాగే ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించాడు.  20-20 క్రికెట్ ఆసియా కప్ లో పాకిస్తాన్ పై ఇండియా గెలిచిందన్న ఆనందంలో సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం సేవించి.. పొద్దు పోయేవరకు డ్యాన్సులు చేశారు. ఉదయాన్నే ఛాతినొప్పితో  యువకుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సీఐ ఎన్. తిరుపతి కథనం మేరకు  వివరాలు ఇలా ఉన్నాయి.  కర్ణాటకకు చెందిన ప్రకాష్ (26) నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. అంజయ్య నగర్ లోని పద్మా నిలయంలో ఉంటూ కొండాపూర్ లోని ఎయిర్టెల్ డిటిహెచ్ లో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఆగస్ట్ 28న రాత్రి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూశారు. ఇండియా గెలవడంతో స్నేహితులతో కలిసి తెల్లవారుజామున రెండు గంటల వరకు మద్యం తాగి డాన్స్ చేశారు.

ఆ సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పిన ప్రకాష్ నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం నిద్రలేచిన తర్వాత అతను కొద్దిసేపు వాకింగ్ చేసి మళ్ళీ ఛాతీలో నొప్పి వస్తోందని.. రెస్ట్ తీసుకుంటానని గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి స్నేహితులు అతడి నిలిపేందుకు ప్రయత్నించగా అపస్మారక స్థితిలో ఉన్నాడు.  వెంటనే గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్ ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

click me!