దారుణం.. మైనర్ ను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్.. స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్..

By SumaBala Bukka  |  First Published Jun 6, 2022, 8:25 AM IST

హైదరాబాద్ లో పన్నెండేళ్ల బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన కేసులో అత్యాచారం జరిగినట్టుగా నిర్థార్ణణ అయ్యింది. బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు. 


చార్మినార్ : రొమేనియా బాలిక కేసుపై తీవ్ర చర్చ జరుగుతుండగానే హైదరాబాదులో మరో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన వెళుతున్న 12ఏళ్ల బాలిక ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి ఒక క్యాబ్ డ్రైవర్ అతడి స్నేహితుడు కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులు కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ షేక్‌ కలీం అలీ, మహ్మద్‌ లుక్మన్‌ అహ్మద్‌ యజ్దానీలను శుక్రవారమే అరెస్టు చేసినా.. జూబ్లీహిల్స్ కేసుపై ప్రతిపక్షాలు ఆందోళన నేపథ్యంలో విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ విషయం మీడియాకు లీక్ కావడంతో ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

తల్లిదండ్రులను చూద్దామని వెడుతుండగా…
హైదరాబాద్ లో పహాడీ షరీఫ్ సమీపంలోని షాహిన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలిక సుల్తాన్ షాహీలోని తన మేనమామ ఇంట్లో ఉంటుంది. తల్లిదండ్రులను చూడాలనిపించడంతో గత మంగళవారం మే 31న సాయంత్రం 6 గంటలకు సుల్తాన్‌షాహీ నుంచి కాలినడకన బయలుదేరింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పహాడీ షరీఫ్  కమాన్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో అటుగా కారులో వెళుతున్న క్యాబ్ డ్రైవర్ షేక్ సలీం అలీ బాలికను గమనించి ఆగాడు.

Latest Videos

undefined

ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ మాట కలిపాడు. షాహిన్ నగర్ లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని, డబ్బులు లేకపోవడంతో నడుచుకుంటూ వెళుతున్నాను అని ఆమె చెప్పింది. దీనిని ఆసరాగా తీసుకున్న కలీం.. డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు, ఇంటివద్ద దింపేస్తానని బాలికను తన క్యాబ్ ఎక్కించుకున్నాడు. ముర్గి చౌక్ ప్రాంతంలో పని ఉందని, అది చూసుకున్నాక దింపేస్తానని చెప్పాడు. రాత్రి 10 గంటల దాకా వివిధ ప్రాంతాల్లో తిప్పి.. తన స్నేహితుడైన మహ్మద్‌ లుక్మన్‌ అహ్మద్‌ యజ్దానీకి ఫోన్ చేశాడు.
 
యజ్దానీ ఇంటికి తీసుకు వెళ్లి…
బస్తీలోని డెక్కన్ ప్యాలెస్ వద్దకు వచ్చిన యజ్దానీ వీరి కారు ఎక్కాడు. ఇద్దరు కలిసి బాలికను కుందుర్గ్ లోని యజ్దానీ ఇంటికి తీసుకు వెళ్లారు. అక్కడే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తీవ్రంగా ఏడుస్తుండడంతో భయపడిన కలీం.. అర్ధరాత్రి తర్వాత ఆమెను కారులో సుల్తాన్ షాహీ వద్ద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరోవైపు రాత్రి 12:15 గంటల సమయంలో బాలిక బంధువులు ఆమె కనిపించడం లేదంటూ మొగల్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

గస్తీ సిబ్బందికి తారస పడటంతో..
గస్తీ బృందం బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సుల్తాన్‌షాహీ వద్ద బాలికను గుర్తించి తీసుకువచ్చారు. తర్వాత  బాలికను  భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడ వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు.. సామూహిక అత్యాచారం జరిగిన విషయం గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసులో అత్యాచారం సెక్షన్లను చేర్చి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

ఫోన్ నెంబర్ ఆధారంగా… 
బాలికను క్యాబ్లో తీసుకువెళ్తున్న సమయంలో కలీం ఆమెకు తన ఫోన్ నెంబర్ చెప్పాడు. బాలిక ఆ నెంబర్ చెప్పడంతో పోలీసులు కాల్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కుందుర్గ్ లోని యజ్దానీ ఇంటికి తీసుకువెళ్లి ఆధారాలు సేకరించారు. భరోసా కేంద్రం లో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో పాటు వైద్య పరీక్షలు చేయించారు. రొమేనియా బాలికపై అత్యాచారం ఘటనపై హడావుడి జరుగుతుండటంతో.. ఈ గ్యాంగ్రేప్ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆదివారం ఈ విషయం మీడియాకు లీక్ అవడంతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

click me!