తెలంగాణలో భారీ వర్షాలతో జరిగిన నష్టంపై తెలంగాణ ప్రభుత్వం గురువారంనాడు శాసనమండలిలో ప్రకటన చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకొనేందుకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలతో 139 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
గురువారంనాడు శాసనమండలిలో వర్షాలు, వరదలపై స్వల్పకాలిక చర్చ జరిగింది.భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భారీ వర్షాలపై జరిగిన నష్టాన్ని వివరించారు. అదే సమయంలో విపక్షాలు చేసిన విమర్శలపై మంత్రి కౌంటరిచ్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో వరద బాధిత ప్రజల కోసం 157 సహయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతంలోని 7870 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
భారీ వర్షాల కారణంగా 756 చిన్న తరహా సాగునీటి చెరువులకు గండ్లు పడ్డాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.చెరువుల పునరుద్దరణకు రూ. 171.1 కోట్లు అవసరమని మంత్రి చెప్పారు. 488 రాష్ట్ర రహదారులు, 29 జాతీయ రహదారులు పునరుద్దరించినట్టుగా ప్రభుత్వం తెలిపింది. రోడ్ల
తాత్కాలిక పునరుద్దరణ కోసం రూ. 253.77 కోట్లు అవసరమౌతుంది.
శాశ్వత పునరుద్దరణ కోసం రూ.1,771.47 కోట్లు అవసరమని అధికారులు లెక్కలు కట్టారు. పంచాయితీరాజ్ శాఖకు చెందిన 1,517 రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం సభకు తెలిపింది. ఈ రోడ్ల తాత్కాలిక పునరుద్దరణ కోసం రూ. 187.71 కోట్లు అవసరమని ప్రభుత్వం ప్రకటించింది. శాశ్వత పునరుద్దరణ కోసం రూ. 1,339.03 కోట్లు అవసరమని ప్రభుత్వం తెలిపింది.ఆగస్టు 8వ వరకు తాత్కాలిక పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
also read:తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరం: ఈటలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న కేటీఆర్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నట్టుగా మంత్రి వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ విషయమై విపక్షాలు తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
అంతకుముందు ఈ విషయమై పలువురు ప్రజా ప్రతినిధులు ప్రసంగించారు. కాంగ్రెస్ పక్ష సభ్యుడు జీవన్ రెడ్డి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. గతంలో కూడ ఈ రకంగా ప్రకటనలు చేసినా కూడ ప్రజలకు సహాయం అందలేదన్నారు.