
హైదరాబాద్: సినిమాలోని క్యారెక్టర్లు కొన్ని సార్లు బలంగా ప్రభావం వేస్తాయి. ముఖ్యంగా కల్ట్ సినిమాలు సొసైటీపై తమదైన ముద్ర వేస్తుంటాయి. కొన్నేళ్లపాటు ఆ సినిమా ప్రభావంలో జీవించే పెద్ద గుంపే ఉంటుంది. సినిమాలకు నిజంగా అంతటి సామర్థ్యం ఉంటుంది. అదీ ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే టీనేజర్లు మరీ సులువుగా ఇలాంటి సినిమాల ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే, వీరు సినిమాలో వేటికి ఆకర్షితులు అవుతున్నారు? వేటిని ఇన్‌స్పిరేషన్ తీసుకుంటున్నానేది కీలకం. అది వారి వారి చైతన్య స్థాయిలను బట్టి ఉంటుంది. కాబట్టి, టీనేజీ పిల్లలు చెడు వ్యసనాలు, లేదా అలవాట్లను సినిమాల నుంచి అడాప్ట్ చేసుకుంటే మాత్రం ముప్పు తప్పదు. గతంలో బిజినెస్ మ్యాన్ సినిమా చూసి కొందరు తప్పు దారిలో వెళ్లిన కథనాలు వచ్చాయి. తాజాగా, కేజీఎఫ్ 2 సినిమాలో రాకీ బాయ్ క్యారెక్టర్‌కు ఆకర్షితుడై.. ఆ క్యారెక్టర్ స్టైల్ అనుకరించాలని ఓ 15 ఏళ్ల బాలుడు ప్రయత్నించాడు. అదీ రాకీ బాయ్ సిగరెట్ స్మోకింగ్‌ను అనుకరించాడు. ఏకంగా ఒక ప్యాక్ సిగరెట్లు మొత్తం తాగేశాడు. ఇంకేం చివరకు హాస్పిటల్‌కు వెళ్లక తప్పలేదు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది
హైదరాబాద్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల్లో మూడు సార్లు కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా చూశాడు. సినిమా లీడ్ రోల్ రాకీ బాయ్ క్యారెక్టర్‌తో ఎక్కువగా ప్రభావితుడు అయ్యాడు. రాకీ బాయ్ స్టైల్ అనుకరించ ప్రయత్నించి చిక్కుల్లో పడ్డాడు. ఒక ప్యాకెట్ సిగరెట్లు మొత్తం తాగేశాడు. దీంతో ఆ బాలుడి గొంతులో తీవ్ర నొప్పి వచ్చింది. విపరీతంగా దగ్గడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ తరలించారు.
హైదరాబాద్‌లోని సెంచరీ హాస్పిటల్‌లో ఆ బాలుడికి చికిత్స జరిగింది. ఆ టీనేజీ బాలుడికి విజయవంతంగా చికిత్స నిర్వహించినట్టు హాస్పిటల్ ప్రకటించింది. కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్టు వివరించింది.
ఈ సందర్భంగా పల్మనాలజిస్ట్ డాక్టర్ రోమిత్ రెడ్డి పాతూరి మాట్లాడుతూ, సమాజంపై బలమైన ముద్ర వేసే శక్తి సినిమా మాధ్యమానికి ఉన్నదని, అందుకే, సిగరెట్లు తాగడం, పొగాకు నమలడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లను గొప్పగా చూపించకుండా ఉండే నైతిక బాధ్యత ఫిలిం మేకర్లు, యాక్టర్లకు ఉన్నదని అన్నారు. కేజీఎఫ్ రాకీ బాయ్ వంటి క్యారెక్టర్లు టీనేజర్లపై సులువుగా బలమైన ముద్ర వేయగలవని తెలిపారు. అలాగే, పిల్లలు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు? వారి మానసిక ప్రవర్తన ఎలా ఉన్నదనే విషయంపై తల్లిదండ్రులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని సూచించారు. పిల్లలు ఓ చెడు ప్రభావానికి గురి కావడం తర్వాత బాధపడే కంటే ముందస్తుగానే అలాంటి వాటిని నివారించే ప్రయత్నాలు చేయాలని వివరించారు.
పొగ తాగడంతో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఈ దురలవాటుకు లోను కావడం మూలంగా పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. శ్వాసకోశ సంబంధ సమస్యలే కాదు.. ఫిజికల్ ఫిట్నెస్‌పైనా దుష్ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తుల ఎదుగుదల, పనితీరుపైనా స్మోకింగ్ తీవ్ర ప్రభావం వేస్తుంది.