తెలంగాణలో 43 వేలు దాటిన కరోనా: ఒక్క రోజే 1,284 కేసులు, 1,902 మంది డిశ్చార్జ్

By Siva KodatiFirst Published Jul 18, 2020, 11:16 PM IST
Highlights

తెలంగాణలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. శనివారం కొత్తగా 1,284 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 43,780కి చేరింది

తెలంగాణలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. శనివారం కొత్తగా 1,284 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 43,780కి చేరింది. ఇవాళ ఆరుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 409కి చేరుకుంది.

ఇవాళ ఒక్క రోజే 1,902 మంది డిశ్చార్జ్ అవ్వడంతో కోలుకున్న వారి సంఖ్య 28,705కి చేరింది. ఒక్క హైదరాబాద్‌లోనే 667 కేసులు నమోదు కాగా, మేడ్చల్ 62, రంగారెడ్డి 68, సంగారెడ్డి 86, కరీంనగర్ 58, నల్గొండ 46, వరంగల్ అర్బన్ 37, భువనగిరి 10, నిజామాబాద్ 26, వనపర్తి 24, సూర్యాపేట 23, సిద్ధిపేటలో 22 మందికి పాజిటివ్‌గా తేలింది. 

కాగా, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు మున్సిపల్ కమీషనర్ తెలిపారు. ఆర్టీసీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజులుగా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు.

అయితే ఆయనది ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో వారందరికీ కూడా జ్వరం వచ్చింది. ఈ నేపథ్యంతో కోవిడ్ సోకిందన్న అనుమానంతో శనివారం మదీనాగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబంలోని మొత్తం 14 మంది కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేయించుకున్నారు.

ఈ క్రమంలో వీరిలో 12 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో కమీషనర్ సుజాత సిబ్బందితో ఆర్టీసీ కాలనీకి వెళ్లి పరిశీలించారు. స్థానికులంతా అప్రమత్తంగా ఉండాలని ధైర్యం చెప్పి ఆ ప్రాంతమంతా శానిటైజేషన్ చేయించారు. 

click me!