పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య: ‘‘పబ్‌జీ’’నే కారణం

By Siva KodatiFirst Published Apr 3, 2019, 10:22 AM IST
Highlights

ప్రమాదకర పబ్‌జీ గేమ్ మరో విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. పబ్ జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించడంతో అలిగిన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రమాదకర పబ్‌జీ గేమ్ మరో విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. పబ్ జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించడంతో అలిగిన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాలకూరి భరత్‌రాజ్, ఉమాదేవి దంపతులు మల్కాజ్‌గిరి విష్ణుపురి ఎక్స్‌టెన్షన్ కాలనీలో నివసిస్తున్నారు.

వీరికి అమ్మాయి, అబ్బాయి సంతానం. కుమార్తె లాహిరి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమారుడు సాంబశివ ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. బుధవారం ఆఖరి పరీక్ష రాయాల్సి ఉంది.

సోమవారం రాత్రి తల్లి సెల్‌ఫోన్ తీసుకుని పబ్‌జీ గేమ్ ఆడుతూ కనిపించాడు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆటలకు దూరంగా ఉండాలంటే ఉమాదేవి గట్టిగా మందలించింది. దీంతో అమ్మపై అలిగిన బాలుడు గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

అరగంట తర్వాత కొడుకు ఏం చేస్తున్నాడోనని తల్లి గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... లోపల గడియ పెట్టి ఉండటంతో కిటికీలోంచి చూసింది. బాలుడు అచేతనంగా కిండపడి ఉండటంతో స్థానికుల సహాయంతో గది తలుపులు విరగ్గొట్టి అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సాంబశివ తువ్వాలుతో ఉరేసుకున్నాడని, బరువు ఎక్కువగా ఉండటంతో తువ్వాలు ఊడి కిందపడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. తల్లి ఉమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!