
పారిశ్రామిక వేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులకు సహకరించిన ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, రాంబాబులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన మల్లారెడ్డి, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ రాంబాబు, నల్లకుంట ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేశారు. జయరాం హత్య తర్వాత రాకేశ్ రెడ్డి ఈ ముగ్గురితో సంభాషించినట్లు ఆరోపణలు వచ్చాయి.
వారి సూచనల మేరకే జయరాం రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు చిత్రీకరించి నందిగామ సమీపంలో కారులో వదిలి వెళ్లినట్లు వీరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కృష్ణాజిల్లా ఎస్పీ.. తెలంగాణ పోలీసుల దృష్టికి తేవడం, జయరాం కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగించడంతో ముగ్గురిపై దర్యాప్తు జరిగింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ముగ్గురు అధికారులపై చర్యలు చేపట్టారు.