
ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒకే పందిట్లో ఓ వరుడు.. ఇద్దరు వధువుల మెడలో తాళికట్టాడు. ఒకే సమయానికి ఇద్దరిని పెళ్లాడాడు. అది కూడా.. సంప్రదాయబద్దంగా.. పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఉత్నూర్ మండలంలోని ఘన్పూర్ గ్రామంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లి చేసుకున్న ఈ ముగ్గురు మేజర్లే. త్వరలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయబోతున్నారు. కాగా... ఇలా ఒకే వరుడు, ఇద్దరు యువతులను పెళ్లాడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక ఆదివాసి ప్రాంతంలో అయితే... ఇలాంటి పెళ్లి జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వరుడు స్వస్థలం ఘన్పూర్ కాగా.. వధువుల్లో ఒకరిది ఇదే గ్రామం. మరో వధువుది పక్కనే ఉన్న మరో గ్రామం. కాగా.. ఈ ఇద్దరు అమ్మాయిలు... వరుడికి బంధువులేనట. వీరిద్దరూ ఒకరికి తెలీకుండా మరొకరు.. ఒకే యువకుడిని ప్రేమించారు. ఇద్దరూ అతనినే పెళ్లిచేసుకోవాలని ఆశపడ్డారు. దీంతో చేసేది లేక.. వీరి పెళ్లికి ఇరు వైపులా పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో.. బంధువుల సమక్షంలో.. వీరి పెళ్లి జరిపించారు. వీరు ముగ్గురూ ఒకే ఇంట్లో కలిసి జీవించనున్నారు. కాగా.. వీరి పెళ్లి స్థానికంగా అందరికీ ఆసక్తి కలిగించడం గమనార్హం.
వరుడు వేలాది అర్జున్ టీటీసీ పూర్తి చేసి.. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. ఇక వధువులు కనక ఉషారాణి, ఆడా సురేఖలు కూడా డిగ్రీ చదువుతున్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలు తనను ఇష్టపడుతున్నారు కాబట్టి.. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని అర్జున్ .. ఒకేసారి వారిని పెళ్లి చేసుకోవడం గమనార్హం.