వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. విహర యాత్రకు వెళ్లి వచ్చిన విద్యార్ధిని ఇంటి వద్ద దింపే సమయంలో యువకుడు బాలికపై లైంగిక దాడి చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వికారాబాద్: జిల్లాలోని యాలాల మండలం అగ్గనూరు ప్రభుత్వ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్ధినిపై రఘుపతి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
యాలాల మండలం అగ్గనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధులను ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ కు విహరయాత్రకు తీసుకెళ్లారు ప్రధానోపాధ్యాయుడు. హైద్రాబాద్ లో విహారయాత్రకు ముగించుకుని ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున స్కూల్ కు తిరిగివచ్చారు. అయితే స్కూల్ వద్దకు వచ్చిన విద్యార్ధులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వీరిశెట్టిపల్లి, పెర్కంపల్లి తండాకు చెందిన నలుగురు విద్యార్ధుల పేరేంట్స్ స్కూల్ వద్దకు రాలేదు.
ఈ నలుగురు విద్యార్ధులను వారి గ్రామాల్లో దింపాలని ఇదే స్కూల్లో చదివిన పూర్వ విద్యార్ధి రఘుపతిని ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి కోరాడు. దీంతో ఈ నలుగురిని తీసుకుని కారులో రఘుపతి బయలుదేరాడు. పెర్కంపల్లి తండాలో ముగ్గురు విద్యార్ధులను దింపిన తర్వాత వీరిశెట్టిపల్లికి వెళ్లే సమయంలో బాలికపై రఘుపతి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను ఇంటి వద్ద వదిలేశాడు. ఈ ఘటన గురించి రెండు రోజుల తర్వాత బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలిపింది . బాధిత కుటుంబసభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రఘుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వెంకటస్మామిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.
.