Counting: ‘40 సీట్లు వచ్చినా చాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ నమ్మకం అదే’

By Mahesh KFirst Published Dec 2, 2023, 11:20 PM IST
Highlights

40 సీట్లు వచ్చినా చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం అనే ధీమాతో కేసీఆర్ ఉన్నారని, బీఆర్ఎస్‌తోపాటు ఇతర పార్టీలు కూడా ఇవే ఆలోచనలతో ఉన్నాయని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. 
 

తెలంగాణలో పోలింగ్ జరిగే వరకు తామే గెలుస్తామని అన్ని పార్టీలు ప్రకటించాయి. కానీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పార్టీల వైఖరి, తీరు మారిపోయింది. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో అధికార బీఆర్ఎస్‌లో కొంత అలజడి రేగినట్టు కనిపించింది. అయితే, అగ్రనేతలు మాత్రం విశ్వాసాన్ని జారనివ్వలేదు. మరికొన్ని గంటల్లో ఫలితాలు రానున్నాయి. దీంతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. 

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని, బీఆర్ఎస్‌కు 30 నుంచి 40 సీట్లే వస్తాయని అంచనాలు తెలిపాయి. కానీ, అధికార బీఆర్ఎస్ పార్టీ తమకు 40 సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న ధీమాతో ఉన్నట్టు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. ఫలితాలు వచ్చాక ఏం చేద్దాం? అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆకునూరి మురళి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

తమకు 40 సీట్లు వచ్చినా చాలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమాలో కేసీఆర్ ఉన్నారని మురళి పేర్కొన్నారు. మెజార్టీకి కావాల్సిన మిగిలిన ఎమ్మెల్యేలను కొనుక్కోగలమనే ధైర్యం బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు ఉన్నదని ఆరోపించారు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీలనే కాదు.. మిగిలిన అన్ని పార్టీల్లోనూ ఈ ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. 

Also Read: 

డబ్బు చూపి, ప్రలోభాలు చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని పార్టీల అగ్రనేతలు ప్లాన్లు వేస్తున్నారని అన్నారు. కానీ, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని, ప్రజా తీర్పు విరుద్ధం అని వివరించారు. ప్రజల చేత ఎన్నుకోబడి... డబ్బు కోసం మర పార్టీలోకి వెళ్లేవారిని ఎలాగైనా అడ్డుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ ఫిరాయింపులను ఆపడానికి 1000 మందితో యాక్షన్ టీం ఏర్పాటు చేయాలని, 10 జిల్లాల్లో 15 టీంలు పెట్టాలని సూచించారు. ఎక్కడ, ఎవరి పై అనుమానం వచ్చినా.. వాళ్ల ఇంటికి వెళ్లి అడ్డగించాలని తెలిపారు.

click me!