దళిత బంధుపై ఎస్సీ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం ... రేవంత్ సర్కార్ కు లేఖ

By Arun Kumar PFirst Published Dec 21, 2023, 12:27 PM IST
Highlights

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత బంధు పథకంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఎస్సీ సంక్షేమ శాఖ దళిత బంధుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసింది. .  

హైదరాబాద్ : గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసమంటూ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. సామాజికంగానే కాదు ఆర్థికంగా అణచివేతకు గురయిన దళితులకు  చేయూత అందించడానే ఈ దళిత బంధును తీసుకువచ్చినట్లు బిఆర్ఎస్ నాయకులు చెప్పేవారు. అయితే ఇటీవల బిఆర్ఎస్ ఓటమిపాలై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దళిత బంధు అమలుపై అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో రైతుబంధు, రైతు భీమా వంటి బిఆర్ఎస్ పథకాలను కొనసాగిస్తామని... ధరణిని తొలగించమని కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటనలు చేసింది. కానీ ఎక్కడ కూడా దళితబంధు ప్రస్తావనే తీసుకురాకపోవడమే తాజా అనుమానాలను రేకెత్తించింది. ఇలా దళితులు భయపడినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధుపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 

గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు కొంతమందికి మాత్రమే అందింది. ఈ పథకం కోసం వేలాదిమంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. కొత్తగావచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితబంధు కొనసాగింపుపై డైలమా కొనసాగుతుండగా కీలక ప్రకటన వెలువడింది. ఈ దళితబంధు దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేయాలంటూ ఎస్సీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. దళిత బంధు నిధుల విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకకూడదని ప్రభుత్వాన్ని కోరింది ఎస్సీ సంక్షేమ శాఖ. 

Also Read  Telangana Assembly : బీఆర్ఎస్ చేసిన అప్పులు బయటపెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందా?

అయితే దళిత బంధు దరఖాస్తులను తాత్కాలికంగానే నిలిపివేసినట్లు... నిధుల విడుదలపై స్పష్టత కోసమే ఎస్సీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దళిత బంధు కింద యూనిట్లు మంజూరైనవారికి నిధులు విడుదల చేయాలా? వద్దా? అన్నదానిపై క్లారిటీ లేదు. దీంతో కొత్త దరఖాస్తుల స్వీకరణను ఆపాలని ఎస్సీ సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. 

ఇదిలావుంటే మొదటి విడత దళిత బంధులో ప్రతి నియోకవర్గంలో వంద కుటుంబాలకు ఆర్థిక సాయం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం. రెండో విడతలో నియోజకవర్గానికి 1100 దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించి దరఖాస్తులను కూడా ఆహ్వానించారు. కొన్నిచోట్ల యూనిట్ల పంపిణీ కూడా ప్రారంభించారు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో దళిత బంధు ప్రక్రియ నిలిచిపోయింది.
 

click me!