బీఆర్ఎస్ కు చెందిన అభ్యర్థులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఓటమి భయంతోనే తమ అభ్యర్థులపై కాంగ్రెస్ దాడులకు దిగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.
హైదరాబాద్:ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలి... అంతేకానీ కత్తిపోట్లు, రాళ్ల దాడులు చేయడం సరికాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ విపక్షాలకు హితవు పలికారు.ఆదివారంనాడు ఉదయం హైద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును తెలంగాణ మంత్రి కేటీఆర్, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
శనివారంనాడు రాత్రి అచ్చంపేటలో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆదివారంనాడు ఉదయం హైద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
undefined
కాంగ్రెస్ నేతలు అల్లరిమూకలు దాడులకు దిగుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మొన్న కొత్తప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడికి దిగారన్నారు. నిన్న గువ్వల బాలరాజుపై రాళ్లతో దాడి చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ శ్రేణులు తమపై దాడి చేస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. 15 రోజుల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తమపై దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలు ఇంతకింత అనుభవిస్తారన్నారు.
తెలంగాణలో ఈ తరహా సంస్కృతి ఏనాడూ చూడలేదని కేటీఆర్ చెప్పారు.రౌడీ రాజకీయం సహించబోమన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందన్నారు. రానున్న 15 రోజులు మరింత కసిగా పనిచేసి బాలరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.
బాలరాజు సతీమణిని కూడ కాంగ్రెస్ శ్రేణులు ఇష్టారీతిలో దుర్భాషలాడారని కేటీఆర్ చెప్పారు. ఈ తరహ పద్దతులను మానుకోవాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శనివారం నాడు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కారులో డబ్బులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ శ్రేణులు ఆ కారును అడ్డుకొనే ప్రయత్నం చేశాయి.అయితే కారు ఆపకుండా వెళ్లడంతో అచ్చంపేట వద్ద కారును అడ్డుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు కూడ అక్కడికి చేరుకున్నాయి.ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి.