తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఈసి అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా ఖమ్మం, పెద్దపల్లిలో రూ.5 కోట్లకు పైగా నగదు పట్టుబడింది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహూరీగా సాగుతున్నాయి. గెలుపు తమదేనంటూ రాజకీయ పార్టీల నాయకులు బయటకు ధీమా వ్యక్తంచేస్తున్నా నిజానికి వారిలోనూ ఏం జరుగుతుందోనన్న ఆందోళన వుంది. సామాన్య ప్రజలే కాదు రాజకీయ విశ్లేషకులు సైతం ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. దీంతో గెలుపు కోసం ఎంతయినా ఖర్చు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు సిద్దమయ్యారు. ఇందుకోసం భారీ నగదును సమకూర్చుకునే క్రమంలో అక్కడక్కడ పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతోంది. ఇలా పోలీసులకు దొరికిన సొత్తే వందలకోట్లలో వుంటే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టడానికి సమకూర్చుకున్న డబ్బు ఇంకెంత వుంటుందో మరి. ఆ లెక్క తెలిస్తే సామాన్యుడి కళ్లు బైర్లుకమ్మడం ఖాయం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మరో మూడురోజులు మాత్రమే సమయం వుంది. రేపటితో ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమవద్దకు చేరిన డబ్బును ఓటర్లను పంచేందుకు అభ్యర్థులు సిద్దమవుతున్నారు. తమకు నమ్మకంగా వుండేవారికి, అనుచరులకు ఈ పంపిణీ బాధ్యతను అప్పగిస్తున్నారు. దీంతో ఎన్నికల కమీషన్, పోలీసులు అప్రమత్తమయ్యారు. అభ్యర్థుల సన్నిహితులు, అనుచరుల ఇళ్లలో సోదాలు ప్రారంభించారు. ఇలా ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో చేపట్టిన సోదాల్లో ఐదు కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఈ డబ్బు ఓటర్లను పంచేందుకే సిద్దం చేసుకునివుంటారని ఈసీ అనుమానిస్తోంది.
undefined
ఖమ్మం పట్టణంలోని శ్రీరామ్ నగర్ లోని ఓ ఇంట్లో భారీగా నగదు వున్నట్లు సమాచారం అందింది. వెంటనే ఈసీ అధికారులు పోలీసుల సహాయంలో ఆ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో మూడు కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఈ డబ్బుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంలో పోటీచేస్తున్న ఓ కీలక రాజకీయ నాయకుడికి చెందిన నగదుగా అనుమానిస్తున్నారు.
ఇలాగే పెద్దపల్లిలో కూడా రెండు కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఎన్టిపిసి కృష్ణానగర్ లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈసి అధికారులు రెండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుతో పార్టీ ఓ రాజకీయ పార్టీ కరపత్రాలు, ఎన్నికల ప్రచార సామాగ్రిని గుర్తించారు. దీంతో ఈ డబ్బు రాజకీయ పార్టీకి చెందినదిగా అనుమానిస్తున్నారు. పట్టుబడిన డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలుంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.