Telangana Election Results 2023; జస్ట్ పాదయాత్ర చేస్తే చాలు సీఎం ఐపోవచ్చు!

By Venugopal Bollampalli  |  First Published Dec 3, 2023, 1:09 PM IST

మానవాభివృద్ధి సూచికలో భారతదేశం 190 దేశాలలో 106వ స్థానంలో ఉంది. అందువల్ల, పాదయాత్ర రాజకీయాలు.. రాజకీయ నాయకులు దేశంలోని సామాజిక, ఆర్థిక వాస్తవాలను అర్థం చేసుకోవడానికి.. తద్వారా ఆ సమస్యలను అట్టడుగు స్థాయిలో పరిష్కరించే మెరుగైన విధానాలను రూపొందించడానికి దోహదపడుతుంది అన్నది సుస్పష్టం. మహాత్మా గాంధీ దండి మార్చ్ నుండి భారతదేశంలో ఒక సంప్రదాయంగా మారిన పాదయాత్ర.. ఇప్పుడు అధికారం చేజిక్కించు కోవడానికి ఓ సాధనంగా మారడం ఆసక్తికరం


పాదయాత్ర చేస్తే అధికారం చేతికి వస్తుందా..?.. ముఖ్యమంత్రి కుర్చీ అవలీలగా సొంతం అవుతుందా..?.. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు అనేక సందర్భాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఔననే నిజాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్

Latest Videos

undefined

భారత్.. సర్వ సత్తాక గణతంత్ర దేశం. అతి పెద్ద ప్రజాస్వామ్య స్థలం. రాజ్యాంగ బద్ధ పాలనకు ఆలవాలం. ప్రజలే పాలకులను ఎన్నుకునే గొప్ప సంప్రదాయం ఉన్న భూమి. అలాంటి ఇక్కడ కొన్నేళ్ల క్రితం వరకు ప్రభుత్వాలు చేసే మంచి చెడులు బట్టి ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉండేది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఇది జరిగేది. అయితే, కాలం మారే కొద్దీ దేశ రాజకీయాల్లో కూడా మార్పులు వచ్చాయి. ప్రజల ఆలోచనా విధానం కూడా మారింది. తమ గ్రామానికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకునే వారికి పట్టం కట్టే పద్ధతిని ప్రోత్సహించడం మొదలు పెట్టారు. తాము చెప్పే బాధలను వినేందుకు మొగ్గు చూపే నాయకుడికి అధికారం అప్పజెప్పేందుకు ప్రజలు మొగ్గుచూపడం పరిపాటిగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో చైతన్య రథయాత్రకు శ్రీకారం చుట్టి నందమూరి తారక రామారావు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత రథయాత్ర కాకుండా పాదయాత్రతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి క్షేత్రస్థాయిలో తిరిగారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని ఓదార్చారు. ఫలితం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ  నుంచి ముఖ్యమంత్రిగా ఏపీలో వైఎస్ కొనసాగారు.

ఆ తర్వాత, 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా అనంతపురం జిల్లా హిందూపురం నుంచి వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేశారు. అలా 2014లో ఏపీలో టీడీపీ అధికారం చేపట్టింది. సరిగ్గా 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నుంచి పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. ఫలితంగా, 2019 ఎన్నికల్లో 151 సీట్లు చేజిక్కించుకుని జగన్ రికార్డ్ సృష్టించారు. ఇదే సందర్భంలో వైఎస్, చంద్రబాబు, జగన్.. ముగ్గురూ పాదయాత్రల ద్వారా ముఖ్యమంత్రులు గానూ పనిచేసి గుర్తింపు పొందారు.

ఇదే పంథాలో ఇప్పుడు తెలంగాణలో టి. కాంగ్రెస్ సారధి రేవంత్ రెడ్డి కూడా చేరారు. టి.టీడీపీని వీడి టి.కాంగ్రెస్లో చేరాక పార్టీని బలోపేతం చేసుకోవడం.. ముఖ్య నేతల సహకారంతో పాదయాత్రకు సంకల్పించడం తెలిసిందే. అలా ప్రజలతో మమేకం కావడంతో పాటు, బీఆర్ఎస్ - కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు రేవంత్ ను బలంగా మార్చాయి. అధికార పార్టీపై వ్యతిరేకత టి.కాంగ్రెస్ కు బలంగా మారేలా చేసారు. అది కాస్తా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టి.కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడానికి దోహదపడింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటిస్తే పాదయాత్ర సంప్రదాయం పునరావృతం అయినట్లవుతుంది.

ఇదిలావుంటే, ఇటీవల నారా లోకేష్, రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేశారు. భారత్ జోడో పేరుతో రాహుల్ యావత్ దేశాన్ని చుట్టేయగా.. యువగళం పేరుతో నారా లోకేష్ యాత్ర కొనసాగిస్తున్నారు. 2024లో జరిగే లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరి పాదయాత్ర ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఏదేమైనా.. గత కొంతకాలంగా, రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారానికి పాదయాత్రను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారన్నది సుస్పష్టం. ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి మరియు నియోజకవర్గాల పొడవునా సమస్యలపై అంతర్దృష్టిని పొందడానికి ఇది సహాయపడుతుంది. వాస్తవానికి, పాదయాత్ర రాజకీయాలు అనేవి కేవలం ఒక విధానం మాత్రమే కాదు. అది ఒక తత్వశాస్త్రం.  రాజకీయ నాయకుల దృక్పథం, నిజాయతీ ప్రజలు వినడానికి చేసే ప్రయత్నాలను సూచిస్తుంది. రాజకీయ వర్గానికి, ఓటర్లకు మధ్య ఉన్న దూరాన్ని గుర్తించడానికి దోహదపడుతుంది. 

మానవాభివృద్ధి సూచికలో భారతదేశం 190 దేశాలలో 106వ స్థానంలో ఉంది. అందువల్ల, పాదయాత్ర రాజకీయాలు.. రాజకీయ నాయకులు దేశంలోని సామాజిక, ఆర్థిక వాస్తవాలను అర్థం చేసుకోవడానికి.. తద్వారా ఆ సమస్యలను అట్టడుగు స్థాయిలో పరిష్కరించే మెరుగైన విధానాలను రూపొందించడానికి దోహదపడుతుంది అన్నది సుస్పష్టం. మహాత్మా గాంధీ దండి మార్చ్ నుండి భారతదేశంలో ఒక సంప్రదాయంగా మారిన పాదయాత్ర.. ఇప్పుడు అధికారం చేజిక్కించు కోవడానికి ఓ సాధనంగా మారడం ఆసక్తికరంగా చెప్పవచ్చు.

click me!