సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కేటీఆర్ ఇవాళ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముందు అపశృతి చోటుచేసుకుని ఇద్దరు గాయపడ్డారు.
సిరిసిల్ల : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. పోలింగ్ కు సమయం దగ్గరపడటంతో వీలైనంత ఎక్కువగా ప్రచారం చేపట్టాలని ఆయా పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇలా హడావుడిగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాల్సిరావడం ప్రమాదాలకు దారితీస్తోంది. ఇలా ఇప్పటికే ఓసారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ప్రచార కార్యక్రమంలో స్వల్ప ప్రమాదం జరిగి ఇద్దరు గాయాలపాలయ్యారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో పోటీచేస్తున్న కేటీఆర్ ఇవాళ ప్రచారం చేపడుతున్నారు. గంభీరావుపేట మండలకేంద్రంలో కేటీఆర్ ప్రచార సభకు నాయకులు ఏర్పాట్లు చేసారు. వేదికకు దూరంగా వున్నవారికి కూడా కేటీఆర్ కనిపించేలా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటుచేసారు. ఇలా ఏర్పాటుచేసిన స్క్రీన్ ప్రేములు విరిగి ఇద్దరిపై పడటంతో గాయపడ్డారు.
undefined
వీడియో
ఎల్ఈడి స్క్రీన్ వద్ద నిల్చున్న ఓ మహిళతో పాటు మరో పురుషుడిపై ఈ ప్రేములు పడ్డాయి. కేటీఆర్ రాకకు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని... లేదంటే మరింత మంది గాయపడేవారని అక్కడున్నవారు జెబుతున్నారు. వెంటనే బిఆర్ఎస్ నాయకులు గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు... చిన్నచిన్న గాయాలైనట్లు తెలుస్తోంది. వీరి వివరాలు తెలియాల్సి వుంది.
ఎల్ఈడి స్క్రీన్లు విరిగిపడిన ఘటన బిఆర్ఎస్, బిజెపి మధ్య వివాదానికి దారితీసింది. సహాయం చేయడానికంటూ బిజెపి నాయకులు బిఆర్ఎస్ సభ వద్దకు చేరుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. బిజెపి నేతలను బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు అక్కడినుండి పంపించారు.