కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బంటు రమేష్ లు ఈ నియోజకవర్గం నుండి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి బరిలోకి దిగడంతో ఈ స్థానంపైనే అందరి దృష్టి ఉంది.
హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. కానీ ఈ దఫా మరోసారి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల నాటికి ఇప్పటికి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఎవరికి వారే తమకే విజయావకాశాలున్నాయని ధీమాగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగారు. ఇదే అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రెండు దపాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.మరోసారి తన అదృష్టాన్ని రేవంత్ రెడ్డి పరీక్షించుకుంటున్నారు.
undefined
2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నుండి పోటీ చేసి రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు. మరోసారి కొడంగల్ నుండి పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
బీజేపీ అభ్యర్ధిగా బంటు రమేష్ ఈ స్థానం నుండి పోటీలో నిలిచారు. బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధికి సీఎం పదవిని కట్టబెడుతామని బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో బీజేపీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి ఐదు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుర్నాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉన్న గుర్నాథరెడ్డిపై రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల సమయంలో గుర్నాథ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి విజయం కోసం కృషి చేశారు. అయితే గుర్నాథరెడ్డికి బీఆర్ఎస్ నాయకత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్నాథరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు రెండు మాసాల క్రితం గుర్నాథ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మరో వైపు ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నందారం సూర్యనారాయణ కుటుంబం కూడ రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచింది. గుర్నాథరెడ్డి, నందారపు సూర్యనారాయణ కుటుంబాలకు పొసగదు. ఈ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ రెండు కుటుంబాలకు పట్టుంది. ఆయా గ్రామాల్లో రెండు గ్రూపులకు క్యాడర్ ఉంది. అయితే తన గెలుపు కోసం ఈ రెండు గ్రూపులు కలిసి పనిచేయాలని నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి కోరారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది.గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాధించిన అభివృద్ది మాత్రమే కొడంగల్ లో కన్పిస్తుందని రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.
నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను పూర్తి చేస్తామని కాంగ్రెస్ హమీ ఇస్తుంది. మహబూబ్ నగర్-చించోలి రోడ్డును పూర్తి చేస్తామని కాంగ్రెస్ హమీ ఇస్తుంది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని కూడ రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే సీఎం రేసులో రేవంత్ రెడ్డి కూడ ఉన్నారు. సీఎం రేసులో ఉన్న అభ్యర్థుల్లో రేవంత్ రెడ్డి కూడ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డికి కలిసివచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే కొడంగల్ లో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ది గురించి ఆ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు.రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ది కంటే ఐదేళ్లలో తాము అభివృద్ది చేసిన విషయాన్ని బీఆర్ఎస్ అభ్యర్ధి ప్రచారం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించాలని కేసీఆర్ కోరారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడని కేసీఆర్ ఈ సభలో వ్యాఖ్యలు చేశారు.
also read:N.T.Rama Rao...1989లో కల్వకుర్తిలో ఎన్‌టీఆర్ ఓటమి, చిత్తరంజన్ దాస్ గెలుపు:కారణాలివీ..
దౌల్తాబాద్, బొంరాస్ పేట మండలాలకు చెందిన స్థానిక నేతలు గతంలో పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. వీరిలో కొంతమంది స్థానిక నేతలు రేవంత్ రెడ్డి వైపు వెళ్లారు. ఇది కొంత నరేందర్ రెడ్డికి ఇబ్బందిని కలిగిస్తుందా, లేదా అనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
ఇదిలా ఉంటే పట్నం నరేందర్ రెడ్డి సోదరుడు పట్నం మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రి పదవిని ఇచ్చాడు. నరేందర్ రెడ్డి విజయం కోసం మహేందర్ రెడ్డి శ్రమిస్తున్నారు.
also read:Raavi Narayana Reddy:నెహ్రు కంటే అత్యధిక ఓట్లు సాధించిన సీపీఐ నేత రావి నారాయణ రెడ్డి
ఇదిలా ఉంటే గత ఎన్నికల సమయంలో పట్నం నరేందర్ రెడ్డి విజయం కోసం హరీష్ రావు కొడంగల్ లో మకాం వేశారు. హరీష్ రావు వ్యూహం ఫలితాలను ఇచ్చింది. రేవంత్ రెడ్డిని ఓడించి పట్నం నరేందర్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ దఫా కొడంగల్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారో డిసెంబర్ 3న తేలనుంది.
also read:Kamareddyలో ఉద్ధండుల పోరు:కేసీఆర్, రేవంత్ ...వెంకటరమణరెడ్డిలలో ఓటర్ల పట్టం ఎవరికో?
ఈ నియోజకవర్గంలో 2,30,251 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,14,140, 1,16,099 మహిళా ఓటర్లున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. లక్షాకు పైగా బీసీ సామాజిక వర్గం ఓటర్లున్నారు.
కొడంగల్ నుండి ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలు
1957-అచ్యుతా రెడ్డి (కాంగ్రెస్)
1962-రుక్మారెడ్డి( ఇండిపెండెంట్)
1967-అచ్యుతారెడ్డి(ఇండిపెండెంట్)
1972-నందారం వెంకటయ్య(ఇండిపెండెంట్)
1978-గురునాథ్ రెడ్డి(ఇండిపెండెంట్)
1983-గురునాథ్ రెడ్డి(కాంగ్రెస్)
1985-నందారం వెంకటయ్య(టీడీపీ)
1989- గురునాథ్ రెడ్డి(కాంగ్రెస్)
1994-నందారం వెంకటయ్య(టీడీపీ)
1996- ఉప ఎన్నిక నందారం సూర్యనారాయణ(టీడీపీ)
1999-గురునాథ్ రెడ్డి(కాంగ్రెస్)
2004-గురునాథ్ రెడ్డి(కాంగ్రెస్)
2009-రేవంత్ రెడ్డి(టీడీపీ)
2014-రేవంత్ రెడ్డి(టీడీపీ)
2018-నరేందర్ రెడ్డి (బీఆర్ఎస్)