తెెలంగాణ ఎన్నికల ప్రచారం చివరిరోజు హుజురాాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి భావోద్వేగంతో చేసిన కామెంట్స్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.
హుజురాబాద్ : ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఏమైనా చేస్తారు... అల్టిమేట్ గా ప్రజలను మెప్పించో ఒప్పించో గెలవడమే వారి లక్ష్యం. ఇలా గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా హుజురాబాద్ లో పోటీచేసి ఓటమిపాలైన పాడి కౌశిక్ రెడ్డి ఈసారి బిఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు. అతడు ఈటల రాజేందర్ లాంటి బలమైన నాయకున్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈటలను ఓడించలేననే ఆందోళనకు గురయ్యాడో ఏమోగానీ ఎమోషనల్ గా ప్రజల ఓట్లను పొందేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం కాస్త బెడిసికొట్టి ఎలక్షన్ కమీషన్ ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది.హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో పాడి కౌశిక్ చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఈసీ ఆదేశించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా కౌశిక్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈసారి ప్రజలు దీవిస్తే గెలిచి విజయయాత్రతో వస్తానని... లేదంటే తన కుటుంబం శవయాత్రకు ప్రజలు రావాల్సి వంటుందన్నారు. ఓడిపోతే తన భార్య, బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ కౌశిక్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
undefined
ఒకవేళ తాను ఓడితే ఇప్పుడు ప్రచారం చేసిన వీధుల్లోనే కుటుంబం శవయాత్ర జరుగుతుందంటూ కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు. కుటుంబంతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలోనే ఆయన ఈ ఎమోషనల్ కామెంట్స్ చేసారు.
తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎలా పనిచేస్తానో చూడాలని కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ప్రజలను కోరారు. హుజురాబాద్ ప్రజలను కడుపులో పెట్టుకుని చూస్తానని... నియోజకవర్గ అభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తానని అన్నారు. అలాకాకుండా మళ్లీ ఓడిపోతే ఇక బ్రతకలేనని... కుటుంబంతో కలిసి ఆత్మహత్యే శరణ్యమని బిఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి భావోద్వేగభరిత కామెంట్స్ చేసారు.
హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు ఎంత ప్రయత్నించినా బిఆర్ఎస్ వల్ల కాలేదు. వందలకోట్లు ఖర్చుచేసినా... బిఆర్ఎస్ నాయకులంతా ఇక్కడే తిష్టవేసి ముమ్మర ప్రచారం చేసినా... దళితబంధు లాంటి హామీలు ఇచ్చినా... ఉపఎన్నికలో బిఆర్ఎస్ గెలవలేకపోయింది. ఎలాంటి లీడర్లు, క్యాడర్ లేకున్నా బిజెపి నుండి పోటీచేసి ఈటల గెలిచారు.
అయితే ఈ ఉపఎన్నిక తర్వాత హుజురాబాద్ లో ఈటలకు ధీటుగా మరో నాయకున్ని తయారుచేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. ఇందుకోసం పాడి కౌశిక్ రెడ్డిని ఎంచుకున్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు మండలిలో విప్ గా అవకాశం కల్పించారు. ఇలా కౌశిక్ రెడ్డిని రాజకీయంగా మరోమెట్టు ఎక్కించి ఇప్పుడు ఈటలపై పోటీ చేయిస్తున్నారు కేసీఆర్. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలాగైనా ఈటలపై గెలిచి తీరాలని భావిస్తున్న కౌశిక్ రెడ్డి చివరి అస్త్రంగా ఎమోషనల్ కామెంట్స్ చేసారు.