తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాల్సిన పోలీసే డబ్బులు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కారులో డబ్బులు తరలిస్తున్న పోలీస్ ను పట్టుకుని చెంప చెళ్లుమనిపించారు కాంగ్రెస్ నాయకులు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. నవంబర్ 30న అంటే ఎల్లుండే పోలింగ్. ప్రచారం ముగిసిన వెంటనే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీకి తెరతీసే అవకాశాలుండటంతో ఈసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా అలర్ట్ అయినట్లున్నారు. పోలీస్ ఐడి కార్డుతో నోట్ల కట్టలు తరలిస్తున్న ఓ వ్యక్తిని కాంగ్రెస్ నాయకులు పట్టుకుని చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు మేడ్చల్ లో చోటచేసుకుంది.
మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల వద్ద ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కారులోని వ్యక్తిని కిందకు దింపు చెక్ చేయగా ఓ బ్యాగులో నోట్లకట్టలు కనిపించాయి. ఈ డబ్బులు ఓటర్లకు పంచేందుకే తీసుకువచ్చినట్లు అనుమానించిన కాంగ్రెస్ నాయకులు దాడిచేసారు. కాంగ్రెస్ కార్యకర్త ఒకరు అతడి చెంప చెళ్లుమనిపించాడు.
undefined
అయితే డబ్బులతో పట్టుబడిన వ్యక్తి వరంగల్ అర్బన్ సీఐ అంజిత్ రావుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి మల్లారెడ్డి కోసమే ఈ డబ్బులు తరలిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీస్ అయివుండి ఇలా ఎన్నికల నిబంధనలను తుంగలోతొక్కి డబ్బులు తరలించడం దారుణమని మండిపడుతున్నారు. ఎన్నికల కమీషన్ సదరు పోలీస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More Breaking News : నిర్మల్ లో కర్రలతో దాడి చేసుకున్న బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలు
కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుమేరకు చెంగిచర్లకు చేరుకున్న ఈసి అధికారులు డబ్బులతో పాటు కారును కూడా సీజ్ చేసారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి డబ్బులు తరలిస్తున్న పోలీస్ పై చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు తెలిపారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు శాంతించి సదరు పోలీస్ ను వదిలిపెట్టారు. ఈ ఘటన నిన్న సాయంత్రమే జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.