తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేస్తున్న బర్రెలక్క పేరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇదికాస్తా ఇప్పుడు జెడి లక్ష్మీనాారాయణ పుణ్యమా అని పక్కరాష్ట్రం ఏపీకి పాకింది.
మంగళగిరి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్. సామాన్యురాలిగా ఎన్నికల నామినేషన్ దాఖలుచేసిన ఆమె ఇప్పుడు అసామాన్యురాలిగా మారారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీచేస్తున్న ఆమెకు ప్రజలు, నిరుద్యోగ యువత నుండే కాదు ప్రముఖుల నుండి మద్దతు లభిస్తోంది. తాజాగా ఆమె క్రేజ్ తెలంగాణను దాటి పొరుగునే వున్న ఆంధ్ర ప్రదేశ్ కు పాకింది.
బర్రెలక్కకు ఇప్పటికే మాజీ ఐపిఎస్ అధికారి జేడి లక్ష్మినారాయణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీకి ధైర్యంగా ముందుకువచ్చిన శిరీషకు ఓటేసి గెలిపించాలని కొల్లాపూర్ ప్రజలను ఆయన కోరారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ యువత కూడా శిరీషను ఆదర్శంగా తీసుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు.
undefined
వీడియో
ఇవాళ(ఆదివారం) రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని వి.జె కాలేజీలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగంలో కుటుంబ పాలన, వ్యక్తి పూజ రాచరికానికి దారితీస్తాయన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను లక్ష్మీనారాయణ గుర్తుచేసారు. కాబట్టి ఎన్నికల్లో డబ్బులున్న వారిని కాకుండా ప్రజా సమస్యలు తెలిసినవారిని ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలా తెలంగాణలో నిరుద్యోగ సమస్యల గురించి తెలిసిన శిరీష్ పోటీ చేస్తోందని అన్నారు.
భారత రాజ్యంగానికి వన్నె తెచ్చేలా కొల్లాపూర్ ప్రజల తీర్పు వుండాలని... స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న బర్రెలక్కను గెలిపించాలని లక్ష్మీనారాయణ సూచించారు. ప్రధాన పార్టీలు కూడా శిరీష కోసం అభ్యర్థులను పక్కకు తప్పించి మద్దతివ్వాలని కోరారు. బర్రెలక్క విజయానికి తెలంగాణలో ప్రతిఒక్కరు కృషి చేయాలని మాజీ ఐపిఎస్ లక్ష్మీనారాయణ కోరారు.