Telangana Congress: కాంగ్రెస్ లో సీఎం రేసు.. తగ్గేదేలే అంటున్న సీనియర్లు..

By Rajesh Karampoori  |  First Published Nov 10, 2023, 5:53 PM IST

Telangana Congress: కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే వారి జాబితా  రోజురోజుకు పెరుగుతూనే ఉంది.  రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి తామేనని మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు ప్రకటించారు.ఇప్పుడు సీఎల్పీ అధినేత తన ఆకాంక్షను స్పష్టం చేయడంతో కాంగ్రెస్ నేతల్లో ముఖ్యమంత్రి పదవి రేసు వేడెక్కింది. 


Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. ఇక నామినేష్లన్ల గడువు ముగియనే లేదు.. ప్రచార పర్వానికి తెరపడనే లేదు.. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కాంగేయులు.  ఎన్నికల పోలింగ్ పూర్తిగా కాకముందే.. ఖచ్చితంగా తామే గెలుస్తామని, సీఎం కేసీఆర్ ను గద్దే దించి.. తాము అధికార పగ్గాలను చేపడుతామని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవి కోసం రేసు మొదలైంది. ఎవరికి వారు తాము సీఎం రేసులో ఉన్నామని ప్రకటించుకుంటున్నారు. ఎవరికి వారే సీఎం కుర్చీపై కర్చీఫ్ వేసుకుంటున్నారు.  

ఒక వేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి ఎవరు?

Latest Videos

undefined

కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు ముఖ్యమంత్రి పదవిని ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. ఎవరికి వారే నేనే సీఎం.. నేనే ముఖ్యమంత్రి అంటూ దరువు వేసుకున్నారు. ఈ పదవి పోటీలో రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు సీతక్క కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఈ పోటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీలు కూడా ఉన్నారు. తాజాగా భట్టి విక్రమార్క కూడా తన మనసులో మాటను బయట పెట్టారు. వాస్తవానికి తెలంగాణ తాము అధికారం సాధిస్తామని హస్తం పార్టీ నేతలు గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. నెక్ట్స్ సీఎం ఏవరనే చర్చ తెలంగాణ ప్రజానీకంలో సాగుతోంది. 

సీఎం పదవి రేసులో నిలిచినవారెవరు?

ఈ రేసులో ఫస్ట్ ఉన్నది  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..ఒక్క వేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీని అధిష్టించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే..  తనకే ముఖ్యమంత్రి ఛాన్స్ వస్తుందని రేవంత్ రెడ్డి కూడా గట్టిగా నమ్ముతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊపు తేవడానికి తాను ఎంతగానే కృషి చేశారనీ, ఆ కృషిని అధిష్టానం కచ్చితంగా గుర్తిస్తుందని, అలాగే.. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆశీస్సులు తన మీద ఉన్నాయని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. 

మరోవైపు  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి అత్యంత అర్హులు తానేనని చెప్పుకుంటున్నారు.తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకే సీఎం కుర్చీ ఇచ్చే ఛాన్స్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.  ఇక సీఎం రేసులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేరు కూడా ఉన్నట్టు జోరుగానే ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా తనను వ్యతిరేకించే వారు ఎవరూ లేరన్న నమ్మకంతో ఉన్నారు.  తొలినాటి నుంచి పార్టీని నమ్ముకున్న వాడు, దళితవర్గానికి చెందిన నేత, అందరిని కలుపుకోని పోయే స్వభావం ఉన్న వ్యక్తి .

ఇటు రాష్ట్ర నాయకులతో .. అటు జాతీయ స్థాయి నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో తనను వ్యతిరేకించే వారు ఉండరు అనే నమ్మకంలో ఉన్నారు భట్టి. అలాగే ఇటీవల పాదయాత్ర చేసి తన కంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది కూడా తనకు కలిసివచ్చే అంశమే.. తాజా గురువారం నాడు తన నియోజకవర్గంలోని మధిరలో జరిగిన రోడ్‌షోలో  భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం మీ మధిర బిడ్డగా నాకు రాబోతోంది. నాలుగోసారి నన్ను ఆశీర్వదించండి..’ అంటూ ప్రజలను కోరారు. 

ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి కూడా మనస్సులో మాటను వెల్లడించారు. వచ్చే పదేళ్లలో తాను ముఖ్యమంత్రి అని అవుతానని  ప్రకటించారు. ‘‘ముఖ్యమంత్రి కావాలనే నా కోరికను దసరా సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి’’ అని జగ్గా రెడ్డి అన్నారు.

మరో అడుగు ముందుకేసి నాగార్జునసాగర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాజీ మంత్రి కె. జానా రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ పదవులు, పదవుల కోసం వెళ్లలేదని, పదవులు, పదవులు తనను పిలుస్తూనే వస్తాయని అన్నారు. "అది పెద్ద విషయం కాదు. సమయం వచ్చినప్పుడు నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేస్తున్న నా కొడుకు కె.జయవీరారెడ్డి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలుస్తా’’ అని జానా రెడ్డి మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ఉదాహరించారు. 

తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క (Sitakka) సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) గెలిస్తే కేసీఆర్ కుటుంబసభ్యులే సీఎం అవుతారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తే.. ఒక ఎస్సీ, ఎస్టీ, ఒక మహిళ, ఓ ఓసీ అభ్యర్థి సీఎం కావొచ్చని, ఓ వేళ పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే.. తాను సీఎం పదవి చేపడుతానని ఎమ్మెల్యే సీతక్క(Sitakka) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వీరితో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్లు కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పై తాము పూర్తి స్థాయి నమ్మకముందనీ,  ఆ నమ్మకం వమ్ము కాదని ఈ నేతలు భావిస్తున్నారు. అయితే.. తెలంగాణ ఇంతకీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? వస్తే సీఎం పీఠాన్ని ఎవరు అధిష్టించనున్నారనేది డిసెంబర్ 3వరకు వేచి చూడాల్సిందే.

click me!