తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టీఆర్ పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. వ్యూహాత్మకంగానే ఎన్టీఆర్ పేరును కేసీఆర్ ఉపయోగిస్తున్నారనే చర్చ కూడ లేకపోలేదు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేరును భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను లక్ష్యంగా చేసుకొని ఎన్టీఆర్ పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది.మూడో దఫా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని భారత రాష్ట్ర సమితి భావిస్తుంది. ఈ మేరకు అన్ని అస్త్రాలను ఉపయోగించుకుంటుంది.
undefined
తెలంగాణ రాష్ట్రంలో ఈ దఫా తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లు దక్కాయి.సత్తుపల్లి, ఆశ్వరావుపేట అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ దఫా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ తొలుత భావించింది. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడ చంద్రబాబు రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. దీంతో తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేయలేమని టీడీపీ చీఫ్ చంద్రబాబు భావించారు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరారు.
మరో వైపు చంద్రబాబునాయుడు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో హైద్రాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో టీడీపీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. హైద్రాబాద్ లో ఐటీ ఉద్యోగుల ఆందోళనల విషయంలో తెలంగాణ సర్కార్ వ్యవహరించిన తీరు చర్చకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎవరూ స్పందించవద్దని కూడ కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన నేతలు ఎవరైనా స్పందిస్తే అది వారి వ్యక్తిగతమని కూడ కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయంగా భారత రాష్ట్ర సమితికి రాజకీయంగా ఇబ్బంది కల్గించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమయ్యాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు.ఈ వయస్సులో చంద్రబాబు అరెస్ట్ చేయడం సరైంది కాదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఐటీ ఉద్యోగుల ఆందోళనల విషయంలో తాను ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో కేటీఆర్ వివరణ ఇచ్చారు.
also read:N.T.Rama Rao...1989లో కల్వకుర్తిలో ఎన్‌టీఆర్ ఓటమి, చిత్తరంజన్ దాస్ గెలుపు:కారణాలివీ.
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం రాజకీయంగా బలహీన పడిన తర్వాత ఆ పార్టీ వెనుక ఉన్న ఓటు బ్యాంక్ చెల్లాచెదురైంది. ప్రధానంగా భారత రాష్ట్ర సమితితో పాటు ఇతర పార్టీల వైపు ఆ ఓటు బ్యాంక్ వెళ్లింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. జీహెచ్ఎంసీతో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో టీడీపీకి కొంత ఓటింగ్ ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. దీంతో ఈ పార్టీ ఓటు బ్యాంక్ పై అన్ని పార్టీలు ప్రధానంగా కేంద్రీకరించాయి. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో ఒక్కడుగు ముందడుగు వేశారు. టీడీపీ సానుభూతిపరులను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
also read:nakrekal assembly segmentలో సీపీఐ(ఎం)దే ఆధిపత్యం: మూడు దఫాలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
ఎన్నికల ప్రచార సభల్లో ఇందిరమ్మ రాజ్యం తీసుకు వస్తామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకలే అంటూ కేసీఆర్ ఎదురు దాడికి దిగుతున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉంటే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఎందుకు ఏర్పాటు చేసి ఉండేవారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఎన్‌టీఆర్ రెండు రూపాయాలకే కిలో బియ్యం పథకాన్ని ఎందుకు ప్రారంభించేవారని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రెండు రూపాయాలకు కిలో బియ్యం ద్వారానే ప్రజల ఆకలి తీరిందని కేసీఆర్ గుర్తు చేస్తున్నారు.
గతంలో ఇదే విషయమై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు.
also read:DMK మద్దతు కాంగ్రెస్‌కే: కేసీఆర్‌కు షాకిచ్చిన ఎంకే స్టాలిన్
అయితే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు, రెండు రూపాయాలకు కిలో బియ్యం వంటి అంశాలను ప్రస్తావించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తుంది. టీడీపీ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకొనే క్రమంలోనే ఎన్టీఆర్ పేరును కేసీఆర్ ప్రస్తావిస్తున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.