పాలేరులో నన్ను ఓడించేందుకు రూ.300 కోట్లు పంపారు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 25, 2023, 4:07 PM IST

బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, పాలేరు ఎమ్మెల్యే అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి . కేసీఆర్ పంచే డబ్బు మనదేనని.. ఆ డబ్బు తీసుకుని ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని పొంగులేటి సూచించారు. ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను దొరల , దోపిడీ పాలన నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.


బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, పాలేరు ఎమ్మెల్యే అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను దొరల , దోపిడీ పాలన నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణలోని ప్రతి గుండె తపిస్తోందని.. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాలు విచ్ఛిన్నమయ్యాయని ఆయన మండిపడ్డారు. 

గడిచిన పదేళ్ల కాలంలో దోపిడి చేసిన లక్షల కోట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీనిలో భాగంగానే తనను ఓడించేందుకు రూ.300 కోట్లు పంపించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పంచే డబ్బు మనదేనని.. ఆ డబ్బు తీసుకుని ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని పొంగులేటి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 

Latest Videos

undefined

ALso Read: బీజేపీ , బీఆర్ఎస్ , ఎంఐఎం ఒక్కటే .. మోడీ చెప్పిన చోట ఒవైసీ పోటీ .. కేసీఆర్‌ను దించగలరా : రాహుల్ గాంధీ

అంతకుముందు ఆదిలాబాద్ ‌లో జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గుర్తుచేశారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే.. సాగుకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. 

కౌలు రైతులకు కూడా రైతుభరోసా అమలు చేస్తామని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమందికి వచ్చాయని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు జరుగుతున్నాయని రాహుల్ అభివర్ణించారు. దొరల తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆయన దుయ్యబట్టారు. భూములు, ఇసుక, మద్యం ద్వారా దోపిడీ సొమ్మంతా కేసీఆర్‌కు చేరిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పేదల భూములు లాక్కునేందుకే దొరల సర్కార్ ధరణి తెచ్చిందని.. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ . 3 లక్షల కమీషన్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. 

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ 6 గ్యారంటీల కార్డు తీసుకొచ్చిందని రాహుల్ గాంధీ వెల్లడించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను చట్టంగా మారుస్తామని.. అమలు చేయకపోతే ప్రశ్నించే హక్కును ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం లాక్కున్న భూములు మళ్లీ పేదలకే అప్పగిస్తామని ..కేసీఆర్ దోచుకున్న ప్రజల సొమ్మును వసూలు చేసి ప్రజలకే ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎం మధ్య ఒప్పందం వందని ఆయన పేర్కొన్నారు. మోడీకి కేసీఆర్, అసదుద్దీన్ మంచి మిత్రులని రాహుల్ ఆరోపించారు. మోడీకి ఢిల్లీలో కేసీఆర్, అసదుద్దీన్‌లు సహాయం చేస్తారని.. తెలంగాణలో కేసీఆర్, అసదుద్దీన్‌లకు మోడీ సాయం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
 

click me!