కొడంగల్ లో నాడు గుడి, గడి మధ్య పోరు:రేవంత్ రెడ్డి కోసం నేడు ఆ రెండు కుటుంబాలు

By narsimha lode  |  First Published Nov 12, 2023, 5:21 PM IST


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు.  కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  2009, 2014 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి  విజయం సాధించారు.  2018లో  ఓటమి పాలయ్యారు. మరోసారి  తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.



కొడంగల్: కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది.  ఈ నియోజకవర్గం నుండి  కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  బరిలోకి దిగారు. బీఆర్ఎస్ తరపున పట్నం నరేందర్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో  గుర్నాథ్ రెడ్డి, నందారం కుటుంబం మధ్య  ప్రధానంగా పోటీ ఉండేది.  గుర్నాథ్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.  నందారం వెంకటయ్య  టీడీపీలో ఉన్నారు.

Latest Videos

undefined

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఇద్దరి మధ్య పోటీని  గుడి, గడి మధ్య  పోటీగా  స్థానికులు భావించేవారు. నందారం వెంకటయ్య కుటుంబ సభ్యులు  కొడంగల్ లో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు.  తిరుపతికి వెళ్లలేనివారు ఈ ఆలయంలో  వెంకటేశ్వరుడిని ప్రార్థిస్తే  కోరికలు తీరుతాయని స్థానికుల నమ్మకం. అందుకే  నందారం కుటుంబాన్ని స్థానికులు  గడి ఫ్యామిలీగా పిలుచుకుంటారు.  గుర్నాథ రెడ్డి కుటుంబాన్ని గడి ఫ్యామిలీగా అప్పట్లో పిలుచుకొనేవారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 అసెంబ్లీ ఎన్నికల్లో  కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా  నందారం వెంకటయ్య  విజయం సాధించారు. నందారం వెంకటయ్య చేతిలో  కాంగ్రెస్  అభ్యర్ధి గుర్నాథ్ రెడ్డి  ఓటమి పాలయ్యారు.  నందారం వెంకటయ్య మరణంతో  1996లో  నందారం వెంకటయ్య తనయుడు నందారం సూర్యనారాయణ విజయం సాధించారు.

2004 ఎన్నికలకు ముందు  ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  నందారం సూర్యనారాయణ మృతి చెందారు.  దీంతో 2004 ఎన్నికల్లో  నందారం సూర్యనారాయణ సతీమణి అనురాధను టీడీపీ బరిలోకి దింపింది.  ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధి గుర్నాథ్ రెడ్డి విజయం సాధించారు.

2009 ఎన్నికల సమయంలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా  రేవంత్ రెడ్డి బరిలోకి దిగి  కాంగ్రెస్ అభ్యర్ధి  గుర్నాథ్ రెడ్డి పై విజయం సాధించారు.  2014 ఎన్నికల్లో  కూడ ఇదే స్థానం నుండి రేవంత్ రెడ్డి  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్నం నరేందర్ రెడ్డిని  బరిలోకి దింపింది. ఈ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో చేరారు గుర్నాథ్ రెడ్డి. ట్రబుల్ షూటర్ హరీష్ రావు  కొడంగల్ లో మకాం వేసి రేవంత్ రెడ్డి ఓటమికి ప్లాన్ చేశారు. హరీష్ రావు ప్లాన్ వర్కౌటై బీఆర్ఎస్ విజయం సాధించింది.

also read:కేసీఆర్ పూర్వీకుల కొనాపూర్ గ్రామస్తుల విరాళం: కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్

అయితే   గుర్నాథరెడ్డికి ఇచ్చిన హామీని నిలుపుకోలేదు.  దీంతో  అసంతృప్తితో ఉన్న గుర్నాథరెడ్డితో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. గుర్నాథరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.దీంతో  గుర్నాథరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం  రేవంత్ రెడ్డి గెలుపు కోసం  గుర్నాథ రెడ్డి  ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరో వైపు రేవంత్ రెడ్డి  టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన  సమయంలో  నందారం  అనురాధ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ లో చేరాలని  కోరారు. అయితే ఆ సమయంలో  నందారం కుటుంబ సభ్యులు  కొంత స్థబ్దుగా ఉన్నారు.  అయితే  నందారం కుటుంబం  ప్రస్తుతం రేవంత్ రెడ్డికి అనుకూలంగా  ఉన్నారు. 

also read:ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కారు సెంటిమెంట్: ఈ దఫా వర్కౌట్ అయ్యేనా?

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామాల్లో గతంలో నందారం, గుర్నాథరెడ్డి గ్రూపులుగా  విడిపోయిన పరిస్థితి ఉండేది. అయితే  రేవంత్ రెడ్డి తన గెలుపు కోసం ఈ రెండు గ్రూపులను సమన్వయం చేసుకొంటూ వెళ్తున్నారు. ఈ నెల  6వ తేదీన నామినేషన్ వేసిన సమయంలో  ఈ రెండు వర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. ఒకనాడు నందారం, గుర్నాథరెడ్డి లు వేర్వేరు పార్టీల్లో ఉండేవారు.  అయితే  రేవంత్ రెడ్డి గెలుపు కోసం  ఈ రెండు వర్గాలు  ప్రస్తుతం  పనిచేస్తున్నాయి.

click me!