తెలంగాణ బలిదానాలకు కేంద్రమంత్రి చిదంబరం క్షమాపణలు చెప్పారు. ప్రజా ఉద్యమంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అందుకు తాము క్షమాపణలు చెబుతున్నామని వివరించారు. మంత్రి హరీశ్ రావు చిదంబరం వ్యాఖ్యలపై మండిపడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బలిదానాలను ఆయన గుర్తు చేశారు. అందుకు క్షమాపణలు చెప్పారు. ఒక రాష్ట్రాన్ని విడగొట్టడం, లేదా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం చిన్నపిల్లల ఆట కాదని అన్నారు. సింపుల్‌గా అయిపోయే పని కాదని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ప్రజా ఉద్యమం ఫలితమే అని వివరించారు.
‘ఆత్మహత్య అనేది దురదృష్టకరం. ఈ ప్రజా ఉద్యమంలో కొందరు మరణించారు. వారికి మా క్షమాపణలు. కానీ, వారి బలిదానాలకు కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేయలేం’ అని వివరించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం జాప్యం చేయడం వల్లే తెలంగాణ ఉద్యమంలో యువత బలిదానాలు చేశారని కేసీఆర్ చేసిన కామెంట్ పై చిదంబరం ఈ విధంగా స్పందించారు. అంతేకాదు, అసలు సీఎం కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణపైనా అవగాహన లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు.
undefined
Also Read: సీఎం కుర్చీ చుట్టే బండి సంజయ్ ప్రచారం.. బీజేపీలో కూడా సీఎం సీటు పంచాయితీ?
హంతకుడే సంతాపం తెలిపినట్టుగా చిదంబరం తీరు ఉన్నదని మండిపడ్డారు. నాడు ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసి విరమించుకున్నది వీరేనని అన్నారు. దాని ఫలితంగానే బలిదానాలు జరిగాయని తెలిపారు. పొట్టి శ్రీరాములు గురించీ చిదంబరం వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నాయని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఉద్యమించినప్పుడు కేంద్రంలో నెహ్రూ ప్రభుత్వమే ఉన్నదని, వారు తాత్సారం చేయడం వల్లే శ్రీరాములు చనిపోయారని వివరించారు.