కేటీఆర్, హరీష్ స్కెచ్ మామూలుగా లేదుగా... ఏకంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కే గాలం

By Arun Kumar P  |  First Published Nov 16, 2023, 10:23 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా పెట్టుకుంది బిఆర్ఎస్. ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబసభ్యులు కేటీఆర్, హరీష్ లకు కీలక బాధ్యతలు అప్పగించారు. 


హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బిఆర్ఎస్ పక్కా వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా రాజకీయాలు చేస్తోంది. ఓవైపు బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం గులాబీ బాస్ ముమ్మర ప్రచారం చేస్తుంటే మరోవైపు ఆయన కుటుంబసభ్యులు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. టికెట్లు దక్కక అసంతృప్తితో వున్న కాంగ్రెస్, బిజెపి నాయకులను బిఆర్ఎస్ గూటికి చేర్చే బాధ్యతను అధినేత కేసీఆర్ కొడుకు, మేనల్లుడు కేటీఆర్, హరీష్ రావు లకు అప్పగించినట్లున్నారు. ఇలా ఇప్పటికే ఇతరపార్టీల్లోంచి చాలామందిని బిఆర్ఎస్ చేరేలా ఒప్పించిన ఈ ఇద్దరు తాజాగా టిపిసిసి ఉపాధ్యక్షుడికే గులాబీ కండువా కప్పేందుకు సిద్దమయ్యారు. 

నిన్న(బుధవారం) తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ రాజీనామా చేసారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేటీఆర్, హరీష్ రావు అలెర్ట్ అయ్యారు. వెంటనే అనిల్ కు ఫోన్ చేసిన కేటీఆర్ బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇంతటితో ఆగకుండా ఇవాళ(గురువారం) మరో మంత్రి హరీష్ రావు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లాడు. హైదరాబాద్ అమీన్ పూర్ లోని గాలి అనిల్ ఇంటికి వెళ్లిన హరీష్ ఆయనతో భేటీ అయ్యారు. 

Latest Videos

undefined

బిఆర్ఎస్ పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని... రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కల్పిస్తామంటూ అనిల్ కు హరీష్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకోసం ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపుకోసం పనిచేయాలని కోరినట్లు తెలుస్తోంది. మంత్రి హరీష్ ఆహ్వానాన్ని మన్నించిన మాజీ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.  

Read More  Harish Rao: కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయి.. హరీష్ రావు ఫైర్

ఇదిలావుంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు గాలి అనిల్ కుమార్. టికెట్ సాధించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసాడు. కానీ రాజకీయ సమీకరణల ద‌ృష్ట్యా ఆ టికెట్ ను ఆవుల రాజిరెడ్డికి కేటాయించింది  కాంగ్రెస్ అధిష్టానం. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయిన గాలి అనిల్ అనుచరులతో చర్చించి పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారు. 

తన రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు గాలి అనిల్. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు తననెంతో మనస్థాపానికి గురిచేసిందని అన్నారు.  తన అభిమానులు, అనుచరులు కూడా కాంగ్రెస్ లో అనేక అవమానాలు ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేసిన వారికి పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి అన్ని విధాలుగా తాను నష్టపోయానని అన్నారు. తన కార్యకర్తల, అభిమానుల ఒత్తిడి, వారి మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు గాలి అనిల్ కుమార్ ప్రకటించారు.

ఇవాళ నర్సాపూర్ లో బిఆర్ఎస్ నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.  ఆయన సమక్షంలోనే గాలి అనిల్ కుమార్ బిఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే హరీష్ ఆయనతో భేటీ అయినట్లు తెలుస్తోంది. 

click me!