అధినేత కేసీఆర్ కే కాదు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కాళేశ్వరం కష్టాలు తప్పడంలేదు. ఆలేరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతను బస్వాపురం నిర్వాసితులు అడ్డుకున్నారు.
ఆలేరు : కేసీఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ కాళేశ్వరం ఇప్పుడు అదే బిఆర్ఎస్ పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడంతో ప్రతిపక్షాలకు మంచి అవకాశం దొరికింది. మొదటినుండి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటిఎంలా వాడుకుంటున్నారని... కమీషన్ల కోసమే ప్రాజెక్ట్ కడుతున్నాడని ఆరోపిస్తూ వచ్చిన ప్రతిపక్షాలు మేడిగడ్డ ఘటన తర్వాత స్వరం పెంచాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడని... అందుకు నిదర్శనమే మేడిగడ్డ బ్యారేజ్ అని ప్రజలకు వివరిస్తున్నారు. ఇలా ప్రతిపక్షాలన్ని కేసీఆర్ సర్కార్ ను కార్నర్ చేసేందకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను వాడుకుంటున్నాయి.
అధినేత కేసీఆర్ కే కాదు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కాళేశ్వరం కష్టాలు తప్పడంలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇలా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యేకు బస్వాపురం రిజర్వాయర్ భూ నిర్వాసితుల నుండి చేదు అనుభవం ఎదురయ్యింది.
undefined
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన బస్వాపురం రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఎమ్మెల్యే సునీతను అడ్డుకున్నారు. తాము కోల్పోయిన భూములకు పరిహారం తక్కువగా వచ్చిందని... న్యాయం చేయాలని నిర్వాసితులు ఎమ్మెల్యేను కోరారు. అయితే ఈ గ్రామంలోని భూములు ఎక్కువశాతం రిజర్వాయర్ లో పోకుండా చూసానని... ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ ఎమ్మెల్యే వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. ఇప్పుడు కూడా భూములు కోల్పోయినవారికి తగిన న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు.
Read More కేటీఆర్, హరీష్ స్కెచ్ మామూలుగా లేదుగా... ఏకంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కే గాలం
అయితే తన మాట వినిపించుకోకుండా పదేపదే ప్రసంగానికి అడ్డుతగిలిన నిర్వాసితులపై ఎమ్మెల్యే సునీత అసహనం వ్యక్తం చేసారు. తాను ప్రజలవద్దకు వచ్చింది ఎన్నికల ప్రచారం కోసమని... అందువల్లే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారని అన్నారు. ఈ సమయంలో ఆందోళన తగదని...ఏదైనా వుంటే తనను కలిసి మాట్లాడాలని సూచించారు. ఇష్టముంటే ఓటు వేయండి లేదంటే లేదు... అంతేగానీ ఇలా ప్రచారాన్ని అడ్డుకోవడం తగదని భూనిర్వాసితులకు సూచించారు. తన ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకుని ఎమ్మెల్యే సునీత గ్రామంనుండి వెళ్లిపోయారు.
ఇదిలావుంటే బస్వాపురం రిజర్వాయర్ లలో తిమ్మాపురం గ్రామం పూర్తిగా ముంపుకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తిమ్మాపురం నిర్వాసితుల పక్షాల మాజీ ఎంపిటిసి జిన్న మల్లేష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. భూ నిర్వాసితులకు న్యాయం చేయడంలేదని బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నట్లు మాజీ ఎంపిటిసి తెలిపారు.