బాబుమోహన్ కు కొడుకు ఉదయ్ షాక్:బీఆర్ఎస్‌లో చేరిన ఉదయ్


మాజీ మంత్రి బాబుమోహన్ టిక్కెట్టు వద్దనుకున్నా భారతీయ జనతా పార్టీ ఆయనకు ఆందోల్ అసెంబ్లీ  టిక్కెట్టు కేటాయించింది. అయితే  ఈ స్థానం నుండి పోటీకి దిగాలనుకున్న బాబుమోహన్ తనయుడికి నిరాశే మిగిలింది. దీంతో బాబుమోహన్ కు కొడుకు ఉదయ్ షాకిచ్చారు.

Google News Follow Us

సంగారెడ్డి: భారతీయ జనతా పార్టీ  నేత, మాజీ మంత్రి  బాబుమోహన్ కు ఆయన తనయుడు ఉదయ్  షాకిచ్చారు.   ఆంథోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ టిక్కెట్టు దక్కకపోవడంతో  ఉదయ్ బాబుమోహన్ భారతీయ జనతా పార్టీని వీడారు.  మంత్రి హరీష్ రావు సమక్షంలో  ఉదయ్ బాబుమోహన్  భారతీయ రాష్ట్ర సమితిలో చేరారు.ఆదివారంనాడు  సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో  భారత రాష్ట్ర సమితిలో  బాబుమోహన్ తనయుడు ఉదయ్ బాబుమోహన్  చేరారు. 

ఉదయ్ బాబు మోహన్ తో పాటు, ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బిజెపి నాయకులు  బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.  మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారుతెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని మంత్రి కోరారు.

1998 నుండి  ఆంధోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించి తొలిసారిగా  అసెంబ్లీలోకి అడుగుపెట్టారు బాబుమోహన్.  తెలుగుదేశం, భారత రాష్ట్ర సమితి, బీజేపీ నుండి ఈ స్థానం నుండి బరిలోకి దిగారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  1998లో ఆందోల్ లో జరిగిన  ఉప ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా బాబుమోహన్ పోటీ చేసి  విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో కూడ  టీడీపీ అభ్యర్ధిగా ఆయన  విజయం సాధించారు.  చంద్రబాబు కేబినెట్ లో  ఆయన మంత్రిగా కూడ పనిచేశారు.  2004, 2009 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహ చేతిలో  టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన  బాబుమోహన్ ఓటమి పాలయ్యారు.

2014 ఎన్నికలకు ముందు బాబుమోహన్ తెలుగుదేశం పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు.  బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆందోల్ నుండి  బాబుమోహన్ పోటీ చేసి విజయం సాధించారు.  2018 ఎన్నికల్లో  బాబుమోహన్ కు బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించలేదు. ఈ స్థానంలో  చంటి క్రాంతికిరణ్ కు భారత రాష్ట్ర సమితి టిక్కెట్టు కేటాయించింది. దీంతో  ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బాబుమోహన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఈ దఫా ఎన్నికల్లో బాబుమోహన్, ఆయన తనయుడు ఉదయ్ బాబుమోహన్ లు  ఆందోల్ అసెంబ్లీ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ టిక్కెట్టు కోసం ప్రయత్నించారు.  ఒకానొకదశలో తనకు టిక్కెట్టు రాదని బాబుమోహన్ భావించారు. బీజేపీ నాయకత్వంపై ఆయన విమర్శలు చేశారు. తనకు ఆందోల్ టిక్కెట్టు అవసరం లేదని కూడ ఆయన ప్రకటించారు.  అయితే అదే సమయంలో  ఉదయ్ బాబుమోహన్  బీజేపీకి మద్దతుగా నిలిచారు.అయితే  ఆందోల్ అసెంబ్లీ టిక్కెట్టును బీజేపీ నాయకత్వం  బాబుమోహన్ కు కేటాయించింది. ఈ టిక్కెట్టు ఆశించిన ఉదయ్ బాబుమోహన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో  ఇవాళ ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పారు.  మంత్రి హరీష్ రావు సమక్షంలో  బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

also read:మల్లికార్జున ఖర్గేతో విజయశాంతి భేటీ: కాంగ్రెస్‌లోకి సినీ నటి

సినిమాల్లో  బాబుమోహన్ విలన్ పాత్రల్లో కూడ నటించారు. అయితే  తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో తనకు వ్యతిరేకంగా బరిలో ఉన్న క్రాంతికిరణ్ కు మద్దతుగా  బీఆర్ఎస్ లో కొడుకు ఉదయ్ బాబుమోహన్ చేరాడు.ఈ పరిణామం బాబుమోహన్ కు కొడుకు నిజజీవితంలో విలన్ గా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.