DK Shivakumar : తెలంగాణకు డీకే శివ కుమార్.. మా అభ్యర్థులను కేసీఆర్ స్వయంగా సంప్రదిస్తున్నారంటూ వ్యాఖ్యలు..

By Asianet NewsFirst Published Dec 2, 2023, 3:50 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో స్వయంగా సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగిపోరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కావడానికి మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కే అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అధికార బీఆర్ఎస్ కొట్టి పారేస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం గెలుపు ధీమాతో ఉంది. అయితే గెలిచే అభ్యర్థులను చేజారి పోకుండా చూసుకునేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

దాని కోసం కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ నేడు తెలంగాణకు పయనమయ్యారు. ప్రయాణం మొదలుపెట్టే ముందు బెంగళూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఇతర పార్టీలు సంప్రదిస్తున్నాయని అన్నారు. కానీ తమ పార్టీ నుంచి ఎన్నికైన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇతర పార్టీలో చేరబోరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

Latest Videos

వారిని ఎవరూ సంప్రదించినా.. వారు ఆ సమాచారాన్ని తమకు చేరవేస్తున్నారని చెప్పారు. కొందరితోనైతే స్వయంగా సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరిపారని అన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులే తమతో తెలిపారని పేర్కొన్నారు. వారిని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాల గురించి తమకు సమాచారం ఉందని, ఈ విషయంలో తాము చాలా జాగ్రత్తగా ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను క్యాంప్ లకు తరలించే అవసరం రాదని స్పష్టం చేశారు. 

అయితే కర్ణాటక ఎన్నికల్లో పొరుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు వచ్చి పని చేశారని గుర్తు చేశారు. ఇక్కడి నాయకులు కూడా తెలంగాణలో పని చేశారని అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పని చేసే బాధ్యత తమకు ఉంటుందని అన్నారు కొన్ని రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనాలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తీసుకొస్తారా అని మీడియా ప్రశ్నించినప్పుడు.. రాజస్థాన్ పాటు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు. అయితే పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకుంటానని తెలిపారు. 
 

click me!