Mallu Bhatti Vikramarka:లక్ష్మీపురం నుండి సీఎల్పీ నేతగా, పాదయాత్రతో పట్టు సాధించిన మల్లు భట్టి

By narsimha lodeFirst Published Nov 29, 2023, 1:43 PM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మల్లు భట్టి విక్రమార్క ఎదిగారు.  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  సీఎం పదవి రేసులో భట్టి విక్రమార్క పేరు కూడ ప్రచారంలో ఉంది.  

 హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ లో  మల్లు భట్టి విక్రమార్క  అత్యంత కీలకమైన నాయకుడిగా ఎదిగారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) కూడ సీఎం రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు  భట్టి విక్రమార్క నిర్వహించిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది. 

Latest Videos

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా  పనిచేశారు.  ఎస్‌సీ, ఎస్టీ సబ్ ప్లాన్  విషయంలో ఆనాటి కాంగ్రెస్ సర్కార్ లో భట్టి కీలకంగా వ్యవహరించారు.  కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల మధ్య ఐక్యత కోసంమ మల్లు భట్టి విక్రమార్క  చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇచ్చాయి. మరోవైపు  తెలంగాణ రాష్ట్రంలో  1300 కు కి.మీ. పైగా  పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారు భట్టి విక్రమార్క. ఒకప్పుడు సీపీఎం (CPI(M))కు కంచుకోటగా ఉన్న మధిర అసెంబ్లీ (Madhira) స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కోటగా మార్చుకున్నారు భట్టి విక్రమార్క. 

మల్లు భట్టి విక్రమార్క విద్యాభ్యాసం

1961 జూన్  15న మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు  జన్మించాడు భట్టి విక్రమార్క.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  వైరా మండలం  స్నానాల లక్ష్మీపురం  మల్లు భట్టి విక్రమార్క స్వంత గ్రామం. మల్లు భట్టి విక్రమార్క నందినిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్యలు. మల్లు భట్టి విక్రమార్కది రాజకీయ కుటుంబం. హైద్రాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు.  హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి  1986 లో  ఎం.ఏ (చరిత్ర) పీజీ పూర్తి చేశాడు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా  పనిచేసిన మల్లు అనంతరాములు  (Mallu Anantha Ramulu)కు భట్టి విక్రమార్క  సోదరుడు.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి అనంత రాములు ఎంపీగా  ప్రాతినిథ్యం వహించాడు.  అనంతరాములు ఆకస్మికంగా మరణించడంతో  ఆయన మరో సోదరుడు మల్లు రవి (Mallu Ravi)  నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించాడు. జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుండి కూడ మల్లు రవి  ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించాడు. మల్లు అనంతరాములు  మరణంతో  భట్టి విక్రమార్క  రాజకీయాల్లోకి వచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ లో  చురుకుగా వ్యవహరించారు.  2007లో  జరిగిన  ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు.  2007 నుండి 2009 వరకు  మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్సీగా  కొనసాగారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో  2009లో  మల్లు భట్టి విక్రమార్క తొలిసారి అడుగు పెట్టారు.  2009 అసెంబ్లీ ఎన్నికల్లో మధిర అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  మల్లు భట్టి విక్రమార్క 2009లో బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్ధిగా బరిలోకి దిగిన లింగాల కమల్ రాజ్ పై  విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో  మల్లు భట్టి విక్రమార్కకు 59,394 ఓట్లు వచ్చాయి. సీపీఐ(ఎం) అభ్యర్ధి లింగాల కమల్ రాజ్ (Lingala Kamal Raju) కు 57,977 ఓట్లు మాత్రమే వచ్చాయి.  

2014 ఎన్నికల్లో  మధిర అసెంబ్లీ స్థానం నుండి మల్లు భట్టి విక్రమార్క  కాంగ్రెస్ అభ్యర్ధిగా రెండో దఫా పోటీ చేశారు.  ఈ ఎన్నికల్లో కూడ సీపీఐ(ఎం) అభ్యర్థిగా లింగాల కమల్ రాజ్ బరిలోకి దిగారు.  అయితే ఈ ఎన్నికల్లో  కూడ మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  మల్లు భట్టి విక్రమార్కకు  65,135 ఓట్లు వచ్చాయి. సీపీఐ(ఎం) అభ్యర్థి  లింగాల కమల్ రాజ్ కు  52,806 ఓట్లు వచ్చాయి.

2018 ఎన్నికల్లో  మధిర నుండి  మరోసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా మల్లు భట్టి విక్రమార్క బరిలోకి దిగారు.  ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగిన   లింగాల కమల్ రాజ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో  భట్టి విక్రమార్కకు 80,598 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్ధి లింగాల కమల్ రాజ్ కు 77,031 ఓట్లు వచ్చాయి. మరోసారి  ఈ స్థానం నుండి  వీరిద్దరూ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుండి భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ నుండి లింగాల కమల్ రాజ్ పోటీ చేస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో  2009 నుండి  2011 వరకు  చీఫ్ విప్ గా మల్లు భట్టి విక్రమార్క పని చేశారు.2011 నుండి  2014 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఆయన  వ్యవహరించారు. 2018లో  తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేతగా  మల్లు భట్టి విక్రమార్క ఎన్నికయ్యారు.  తెలంగాణ అసెంబ్లీలో  విపక్ష నేతగా ఆయన కొనసాగుతున్నారు.1990-92 వరకు ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్ గా  మల్లు భట్టి విక్రమార్క  పనిచేశారు.2000-2003 వరకు పీసీసీ సెక్రటరీగా మల్లు భట్టి విక్రమార్క కొనసాగారు.

మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర

తెలంగాణ రాష్ట్రంలో మల్లు భట్టి విక్రమార్క  2023  మార్చి 16న ఆదిలాబాద్  జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  పాదయాత్ర నిర్వహించారు. పీపుల్స్ మార్చ్  అని ఈ పాదయాత్రకు  నామకరణం చేశారు.

రాష్ట్రంలోని  17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా  1,360 కిలోమీటర్ల పాదయాత్రను మల్లు భట్టి విక్రమార్క నిర్వహించారు.
ఈ పాదయాత్ర ముగింపునకు గుర్తుగా   ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడులో పైలాన్ ను ఆవిష్కరించారు. 2023 జూలై 2న  ఖమ్మంలో జన గర్జన పేరుతో  భారీ బహిరంగ సభను నిర్వహించారు. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభను నిర్వహించారు.ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ నేత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1,467 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు  2,817  కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.భట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది.రాజకీయ కుటుంబం నుండి వచ్చినప్పటికీ  రాజకీయాల్లో  మల్లు భట్టి విక్రమార్క  అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీలో పలు పదవులను అలంకరించారు.  తెలంగాణలో  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  సీఎం రేసులో  మల్లు భట్టి విక్రమార్క  పేరు ఉంది.  

click me!