ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జళగం వెంగళరావుకు దక్కిన అవకాశమే తనకు దక్కనుందంటూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అన్నదానికంటే గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పార్టీని ముందుండి నడిపిస్తున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అవుతారా లేదంటే సీనియర్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటివారు అవుతారా అన్న చర్చ ఆ పార్టీలోనే కాదు బయటకూడా జరుగుతోంది. ఇలాంటి సమయంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన జళగం వెంగళ్రావు ఖమ్మం బిడ్డేనని భట్టి విక్రమార్క గుర్తుచేసారు. ఆయన హయాంలో ఖమ్మం అభివృద్ది జరిగిందని అన్నారు. అలాంటి మరో అద్భుత అవకాశమే మళ్లీ త్వరలోనే రానుందని... అన్నిరంగాల్లో మరోసారి ఖమ్మంను అభివృద్ది చేసుకుందామని అన్నారు. త్వరలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వానికి దశ దిశ నిర్దేశించేలా మధిర నియోజకవర్గం వుండనుందని భట్టి అన్నారు.
undefined
దివంగత నేత జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశమే తనకు వస్తుందంటూ భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఉమ్మడి ఖమ్మం నుండి సీఎల్పీ నేతగా వెంగళరావు తర్వాత పనిచేసిందే తానేనని భట్టి తెలిపారు. ప్రజల ఆశిస్సులతో రాజకీయంగా మరింత ముందుకు వెళతాననే నమ్మకం వుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేసారు.
Read More తిరిగి బిఆర్ఎస్ సర్కార్ వచ్చినా... ఈసారి కూల్చివేయడం ఖాయం : బండి సంజయ్ సంచలనం
ఇలా జళగం వెంగళరావు పేరును ప్రస్తావిస్తూ పరోక్షంగా తాను సీఎం రేసులో వున్నానని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు కీలక పదవి దక్కనుంది కాబట్టి మధిర ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే ఉమ్మడి ఖమ్మం సర్వతోముఖాభివృద్ది సాధ్యమని భట్టి విక్రమార్క అన్నారు.