తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతామని కాంగ్రెస్ చెబుతున్నది. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతామని ప్రకటించింది. ఈ డిమాండ్‌ను ఎదుర్కోవడానికి బీజేపీ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ప్రత్యేకంగా ఓబీసీ, ఎస్సీ కమ్యూనిటీని తమ వైపు మలుపుకునే ప్రయత్నాలు మొదలు పెడుతున్నది.
హైదరాబాద్: బిహార్ ప్రభుత్వం కుల గణన సర్వే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అందరి అంచనాలను తప్పుపడుతూ అగ్రవర్ణాల జనాభా మరింత తక్కువ ఉన్నదని తేల్చడమే కాదు.. బీసీల జనాభా అందరు అనుకున్నదాని కంటే చాలా ఎక్కువ ఉన్నదని స్పష్టం చేసింది. బిహార్ క్యాస్ట్ బేస్డ్ సర్వే తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ కుల జనగణన చేపట్టానే డిమాండ్‌లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కుల గణన చేపడుతామని ప్రకటించింది. బిహార్‌లో కుల గణన ప్రక్రియపై అప్పుడు అభ్యంతరపెట్టిన బీజేపీ ఇప్పుడు ఎన్నికల వేళ ఈ డిమాండ్‌ను ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాన్ని రచించింది.
బీజేపీకి ఉన్నపళంగా బీసీలు, ఎస్సీలపై ప్రేమ పుట్టుకొచ్చిందని, తెలంగాణలో బీసీల గురించి ఎస్సీ వర్గీకరణ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి ప్రకటనలు చేయడాన్ని విశ్లేషకులు ఒక భిన్నమైన కోణంలో చూస్తున్నారు. ప్రతిపక్షాలు కుల జనగణను డిమాండ్‌ను లేవనెత్తుతున్న తరుణంలో చాకచక్యంగా దాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ బీసీ, ఎస్సీలను హడావిడిగా చేరదీసే పనిలో పడిందని చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేస్తామనే నిర్ణయం కూడా ఇందులో భాగమేనని, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ డిమాండ్‌ను ఎదుర్కొనే బీజేపీ ఎత్తులో భాగమేనని అంటున్నారు.
undefined
Also Read: ఢిల్లీ కాలుష్యం కారణంగా జైపూర్‌కు సోనియా గాంధీ.. అప్పటి వరకు అక్కడే
వాస్తవానికి 2014లో లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే తొలి 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామనీ చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక విస్మరించారు. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం అటువైపుగా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చింది.
కుల గణనను ఎదుర్కోవడానికే బీజేపీ ప్రత్యేకంగా ఓబీసీలు, ఎస్సీలను ఆకట్టుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నదని, తద్వార కుల గణను డిమాండ్‌కు నీరుగార్చాలనే ప్లాన్ ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. బీజేపీ సూటిగా కుల గణన డిమాండ్‌ను తోసిపుచ్చడం లేదు. కానీ, వ్యూహాత్మకంగా ఈ ప్రణాళికలను అమలు చేస్తున్నదని వివరించారు.