రాం మాధవ్‌తో టీఆర్ఎస్ ఎంపీ భేటీ

By narsimha lodeFirst Published Mar 26, 2019, 11:34 AM IST
Highlights

మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్‌తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా జితేందర్ రెడ్డి టీఆర్ఎస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

హైదరాబాద్: మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్‌తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా జితేందర్ రెడ్డి టీఆర్ఎస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

ఈ నెల 29వ తేదీన ప్రధాని సమక్షంలో జితేందర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.గత ఏడాది డిసెంబర్ 7 వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా జితేందర్ రెడ్డి పనిచేశారని ఆ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.  దీంతో జితేందర్ రెడ్డి స్థానంలో శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్‌ టిక్కెట్టును కేటాయించారు.

సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు టిక్కెట్టుకు ఇవ్వని కారణంగా  జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.సోమవారం రాత్రి బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్‌తో హైద్రాబాద్‌లో భేటీ అయ్యారని సమాచారం.  ఈ భేటీలో మూడు డిమాండ్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందు జితేందర్ రెడ్డి పెట్టినట్టుగా సమాచారం.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జీ పదవిని ఇవ్వాలని కూడ జితేందర్ రెడ్డి బీజేపీ నాయకత్వాన్ని కోరినట్టు సమాచారం. అదే విధంగా ఈ నెల 29వ తేదీన ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

హైద్రాబాద్ నుండి మహబూబ్‌నగర్‌కు ప్రధానితో పాటు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని రాం మాధవ్ ముందు జితేందర్ రెడ్డి ప్రతిపాదించినట్టుగా సమాచారం. మరో వైపు దేశంలోని ఏదో ఒక రాష్ట్రం నుండి తనకు రాజ్యసభ పదవిని కూడ ఇవ్వాలని జితేందర్ రెడ్డి బీజేపీ నేత రాం మాధవ్‌ ముందు పెట్టినట్టుగా సమాచారం.

జితేందర్ రెడ్డి గతంలో బీజేపీలో కూడ పనిచేశారు. 1999 పార్లమెంట్ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా ఆనాడు టీడీపీ మద్దతుతో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీజేపీకి గుడ్‌బై చెప్పారు.  టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి టీడీపీ తరపున ఎంపీ గా పోటీ చేయాలని భావించారు.

కానీ, ఆనాడు మహాకూటమి పొత్తుల్లో భాగంగా మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పోటీ చేశారు. దీంతో చేవేళ్ల నుండి టీడీపీ అభ్యర్ధిగా జితేందర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  ఆ తర్వాత జితేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు.2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా జితేందర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.

click me!