ముందు హైదరాబాద్ రిజల్ట్, ఆఖర్లో మల్కాజిగిరి: అభ్యర్థుల్లో టెన్షన్

By Siva KodatiFirst Published May 22, 2019, 1:32 PM IST
Highlights

45 రోజులుగా సాగుతున్న నరాలు తెగే ఉత్కంఠకు మరో కొద్ది గంటల్లో తెర పడనుంది. హోరాహోరీగా పోరాడిన అభ్యర్ధుల భవితవ్యంపై ఓట్లర్లు ఇచ్చిన తీర్పు గురువారం వెలువడనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఇప్పటి వరకు పైకి బాగానే ఉన్న లోలోపల మాత్రం టెన్షన్‌గానే ఉన్నారు. 

45 రోజులుగా సాగుతున్న నరాలు తెగే ఉత్కంఠకు మరో కొద్ది గంటల్లో తెర పడనుంది. హోరాహోరీగా పోరాడిన అభ్యర్ధుల భవితవ్యంపై ఓట్లర్లు ఇచ్చిన తీర్పు గురువారం వెలువడనుంది.

పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఇప్పటి వరకు పైకి బాగానే ఉన్న లోలోపల మాత్రం టెన్షన్‌గానే ఉన్నారు. తెలంగాణలో కీలకమైన హైదరాబాద్‌లో అధికారులు కౌంటింగ్‌కు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

గ్రేటర్ పరిధిలో అతి తక్కువ ఓట్లున్న హైదరాబాద్ ఫలితం ముందుగా వెలువడే అవకాశం కనిపిస్తుండగా... మల్కాజిగిరి లోక్‌సభ ఫలితం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో అన్ని శాసనసభ స్థానాల్లో పద్నాలుగు టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేస్తారు. అనంతరం ప్రతి నియోజకవర్గంలోని ఐదు బూత్‌లలో వీవీప్యాట్లలోని స్లిప్పులను లాటరీలో తీసి లెక్కించిన తర్వాతే తుది ఫలితాన్ని ప్రకటిస్తారు.

మల్కాజిగిరి పరిధిలోని కుత్భుల్లాపూర్ ఓట్లను అత్యధికంగా 34 రౌండ్లలో మేడ్చల్, ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను 28 రౌండ్లలో లెక్కించనున్నారు. ఇక చేవేళ్ల పరిధిలోని శేరిలింగంపల్లి శాసనసభ ఓట్ల కౌంటింగ్‌ను 43 టేబుళ్లపై లెక్కించనున్నారు.

ఓట్లను ఎల్బీ స్టేడియం, కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియం, ఉస్మానియావర్సిటీ, రెడ్డి విమెన్స్‌ కాలేజీ, కోఠి విమెన్స్‌ కాలేజీ, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నిజాం కాలేజీ, మాసబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ , పాల్మాకులలోని గురుకుల పాఠశాలలో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పోలింగ్ జరిగిన దాదాపు ఆరువారాల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుండటంతో అభ్యర్ధులు, వారి అనుచరుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌పై ఎంఐఎం పూర్తి స్పష్టతో ఉండగా.. సికింద్రాబాద్‌పై బీజేపీ, టీఆర్ఎస్‌లు గట్టి అంచనాలు పెట్టుకున్నాయి. మల్కాజిగిరి, చేవెళ్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. 

click me!