మోదీని సంతృప్తిపరచడానికే ఎగ్జిట్ పోల్ సర్వేలు... విజయశాంతి

By telugu teamFirst Published May 20, 2019, 3:58 PM IST
Highlights

దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు ఆదివారం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ... కేంద్రంలోని బీజేపీ కూటమికి మద్దతుగానే ఉన్నాయి. కాగా... దీనిపై తాజాగా కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి స్పందించారు. 

దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు ఆదివారం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ... కేంద్రంలోని బీజేపీ కూటమికి మద్దతుగానే ఉన్నాయి. కాగా... దీనిపై తాజాగా కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి స్పందించారు. కేవలం ప్రధాని మోదీని సంతృప్తిపరచడానికే ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలయ్యాయని ఆమె అన్నారు.

ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చూస్తుంటే 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభంజనం వీచిందని అందరూ చెప్పుకున్న తరుణంలో కూడా బీజేపీకి ఇంత అనుకూల పరిస్థితి కనిపించలేదని, నిన్న విడుదలైన ఫలితాలు చూస్తే... ఒకదానికొకటి పొంతనలేదని విజయశాంతి చెప్పారు. 

నిజంగా ఈసారి ఎన్నికల్లో కూడా మోదీ ప్రభంజనం వీచే పరిస్థితి ఉంటే.. స్వయంగా మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సీట్లు ఎందుకు తగ్గుతున్నాయని ఆమె ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ మీద ఉత్తరప్రదేశ్ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. 

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ప్రజలను మోదీ సంతృప్తి పరచలేనప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా మోదీకి అనుకూలంగా ఓటు వేశారని ఎలా భావించగలమని విజయశాంతి అన్నారు.
 
‘‘ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాలను కూడా పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే తప్ప ఎగ్జిట్ పోల్‌లో పేర్కొన్న విధంగా 295 నుంచి 305 సీట్లు వచ్చే అవకాశం లేదు.’’

‘‘ నిజంగా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వాస్తవమే అయితే గత నాలుగు నెలల కాలంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన తప్పులు ఏమిటి? ఈ మూడు రాష్ట్రాల ప్రజలకు మోదీ ఇచ్చిన వరాలు ఏమిటి? మరో నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు మోదీకి వ్యతిరేకంగా ఏ రకమైన తీర్పును ఇవ్వబోతున్నారనే విషయం వెల్లడి కానున్న తరుణంలో చివరిగా ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఈ రకమైన ఆనందాన్ని పొందుతునందుకు బీజేపీ నేతలను చూసి జాలి పడటం తప్ప మరేమీ చేయలేము.’’ అంటూ విజయశాంతి పోస్ట్ చేశారు.

click me!