పిడికిలి బిగిస్తా, పొలికేక తెలంగాణ నుంచే పెట్టాలె: కేసీఆర్

By Nagaraju penumalaFirst Published Apr 2, 2019, 8:55 PM IST
Highlights

కాంగ్రెస్‌ లేని భారత్‌ కావాలని బీజేపీ.. బీజేపీ లేని దేశం కావాలని కాంగ్రెస్‌ అంటున్నాయని అన్నారు. కానీ ఆ రెండు పార్టీల్లేని భారత్‌ కావాలని తాను పిలుపునిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు దీవిస్తే దేశం గతిని మార్చేందుకు పిడికిలి బిగిస్తానన్నారు. తెలంగాణ నుంచి 16 మంది ఎంపీలు గెలిచి దేశం కోసం పొలికేక పెట్టాలె అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

భువనగిరి: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ బతుకు చిత్రం మారిపోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ చెప్పుకొచ్చారు. 

భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో వైద్యులందర్నీ ఏకం చేసిన వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ అంటూ కేసీఆర్ కొనియాడారు. నర్సయ్య గౌడ్ ను మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ సీట్లు టీఆర్ఎస్ గెలిచేలా ప్రజలు ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు. భువనగిరి జిల్లా కావాలనే ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ఘనత తమదేనన్నారు. యాదాద్రి రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయని స్పష్టం చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తుదిదశకు వచ్చిందని తెలిపారు. కాళేశ్వరం పూర్తైతే యాదాద్రి జిల్లాలోని 10లక్షల ఎకరాల పంటపొలాలు పచ్చగా మారుతాయన్నారు. దేశంలో ఉన్న జలవనరులను వినియోగించుకునే సమర్ధత ఈ ప్రభుత్వాలకు లేవంటూ బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు.

 దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని దాని ద్వారా 3.44 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్నది మన దేశంలోనే అన్నారు. కాంగ్రెస్‌ లేని భారత్‌ కావాలని బీజేపీ.. బీజేపీ లేని దేశం కావాలని కాంగ్రెస్‌ అంటున్నాయని అన్నారు. 

కానీ ఆ రెండు పార్టీల్లేని భారత్‌ కావాలని తాను పిలుపునిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు దీవిస్తే దేశం గతిని మార్చేందుకు పిడికిలి బిగిస్తానన్నారు. తెలంగాణ నుంచి 16 మంది ఎంపీలు గెలిచి దేశం కోసం పొలికేక పెట్టాలె అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

click me!